
రెండు ప్రాణాలు తీసిన అప్పు గొడవ
రుణం విషయమై కౌలు రైతు బలవన్మరణయత్నం కేసుల భయంతో అప్పు ఇచ్చిన వ్యక్తి కుటుంబం ఆత్మహత్యాయత్నం బావిలో దూకిన తల్లి, కుమారుడు మృతి పురుగుమందు తాగి చికిత్స పొందుతున్న తండ్రి
సత్తెనపల్లి: ఇద్దరు కౌలు రైతుల మధ్య చిన్న గొడవ కుటుంబాల వరకు చేరింది. ఈ క్రమంలో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన సత్తెనపల్లి మండలం పణిదం గ్రామంలో బుధవారం వెలుగుచూసింది. వివరాలు... గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన దాసరి వెంకటేశ్వర్లు కౌలు రైతు. భార్య, ఇరువురు కుమారులు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన మరో కౌలు రైతు రామనాథం శ్రీనివాసరావుతో పరిచయం ఉంది. స్థానికుడైన కంచేటి జనార్దనరావు వద్ద ఎకరం పొలానికి రూ. 25 వేలు సాగుకు ముందే కౌలు చెల్లించేలా శ్రీనివాసరావు ఒప్పందం కుదిర్చాడు. శ్రీనివాసరావు వద్ద రూ. 50 వేల నగదు, ద్విచక్రవాహనం కుదవ పెట్టి రూ. 48 వేలను వెంకటేశ్వర్లు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకుండా దాటవేస్తుండటంతో బొడ్డు రమేష్ మధ్యవర్తిత్వం ద్వారా బైకు తాలూకు నగదు వడ్డీ సహా ఇచ్చాడు. మిగతా రూ. 50 వేలు అడగటంతో కాలయాపన చేస్తున్నాడు. ఈ నెల 15న శ్రీనివాసరావు, ఆయన కుమారుడు, మరో వ్యక్తి కలిసి వెళ్లి గట్టిగా ప్రశ్నించటంతో రూ. 25 వేలు ఇచ్చాడు. జనార్దనరావు వచ్చి కౌలు తాలూకు నగదు కూడా ఇప్పించాలని శ్రీనివాసరావును అడిగాడు. దీనికి సంబంధించి శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు మధ్య వాదనలు జరిగాయి. అనంతరం వెంకటేశ్వర్లు, శ్రీలేఖ దంపతులు ఇంట్లో కూడా గొడవపడ్డారు. మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రి పురుగుమందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. సత్తెనపల్లిలో ప్రాథమిక చికిత్స చేయించి, గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
నేలబావిలోకి దూకి...
ఈ క్రమంలో కేసులు అవుతాయనే భయంతోనే శ్రీనివాసరావు, ఆయన భార్య పూర్ణకుమారి (47), కుమారుడు వెంకటేష్ (23)లు బుధవారం పొలానికి వెళ్లారు. అక్కడే వారు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. కొద్దిసేపటికి తల్లి, కుమారుడు స్థానికంగా ఉన్న ఓ నేల బావిలోకి దూకి బలవన్మరణానికి యత్నించారు. పూర్ణకుమారికి గుండె సమస్యలు ఉండటంతో చనిపోయింది. కుమారుడు బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో మృతదేహం బయటపడింది. శ్రీనివాసరావు కూడా అప్పటికే వివాహమై తాటికొండ మండలం పాములపాడులో ఉంటున్న కుమార్తె వెంకట జ్యోతికి ఫోన్ చేసి చనిపోవాలని ముగ్గురం నిర్ణయించుకున్నట్లు చెప్పి ఫోన్ ఆపేశాడు. తర్వాత గడ్డి మందు తాగి పొలం వద్దకు వెళ్లాడు. వెంకటజ్యోతి తన భర్తతో కలిసి వచ్చి తండ్రిని సత్తెనపల్లి ప్రైవేట్ వైద్యశాలకు తరలించింది. ప్రస్తుతం ఆయన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని సత్తెనపల్లి రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు, పోలీసులు సందర్శించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు.
పూర్ణకుమారి, వెంకటేష్ మృతదేహాలు
చికిత్స పొందుతున్న శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు

రెండు ప్రాణాలు తీసిన అప్పు గొడవ

రెండు ప్రాణాలు తీసిన అప్పు గొడవ

రెండు ప్రాణాలు తీసిన అప్పు గొడవ