
ప్రబలిన డయేరియా
గుంటూరు నగరం విలవిల వాంతులు, విరేచనాలతో పలువురు ఆస్పత్రుల్లో చేరిక గుంటూరు జీజీహెచ్‌లో 33 మందికి చికిత్స
గుంటూరు మెడికల్ / నెహ్రూనగర్: గుంటూరు నగర ప్రజలు ఒక్కసారిగా ప్రబలిన డయేరియాతో ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల నుంచి నిత్యం పది మందికి పైగా బాధితులు వాంతులు, విరేచనాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వరుసగా డయేరియా కేసులు నమోదవుతుండటంతో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా నగరంలో విపరీతంగా వర్షాలు కురవడంతో పాటు, నీటి నిల్వలు బాగా పేరుకు పోయాయి. తద్వారా నీరు కలుషితమై డయేరియా ప్రబలినట్లు బాధితులు వాపోతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో మున్సిపల్ వాటర్ పైపులైనులు మురుగు నీటిలో ఉన్నాయి. అవి దీర్ఘకాలికంగా కాల్వల్లో ఉండటం వల్ల తుప్పుపట్టి పోయి లీకవుతున్నాయి. వ్యర్థాలు మంచినీటి పైపులైనుల ద్వారా కుళాయిలోకి చేరి వ్యాధులు కలుగ చేసేందుకు కారణమవుతున్నాయి. గతంలో డయేరియా నమోదైన ప్రాంతాల్లో అధికారులు పైపులైనులు కొన్నింటిని మార్పించారు. పూర్తి స్థాయిలో ప్రక్రియ చేపట్టకపోవడంతో మరలా డయేరియా సమస్య ప్రబలింది.
కలుషిత నీరే కారణం
మంచినీరు కలుషితంగా మారడం వల్లే వాంతులు, విరేచనాలు అవుతున్నాయని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు బాధితులు వాపోయారు. మంచినీరు మురుగు వాసన వస్తుందని తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర,ఊ నీటి కాలుష్యం జరగడం వల్లే వ్యాధులు ప్రబలుతున్నట్లు ఆరోపిస్తున్నారు.