
రైతుల పక్షాన నిరంతర పోరాటం
● వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి ● నేడు పర్చూరులో రైతు సమస్యలపై అధికారులకు వినతిపత్రం
పర్చూరు(చినగంజాం): రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి అన్నారు. బుధవారం ఇంకొల్లు మండలంలోని పావులూరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ స్థాపన నుంచి రైతుల కోసం కృషి చేస్తూనే ఉందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాలు స్థాపించి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుబాటులోకి ఉంచామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులను ఇబ్బందులు పడుతున్నట్లు దుయ్యబట్టారు. రైతులకు చేసిన మేలేమీ లేదన్నారు. ఎరువులు, పురుగు మందులు సరఫరా లేక, గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు కన్నీటిపాలయ్యారని ఆరోపించారు. పొగాకు రైతులు నట్టేట మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు విషయంలో కృత్రిమ కొరత సృష్టించి, తమ పార్టీలోని నాయకులతోనే యూరియాను దారి మళ్లించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కూటమి ప్రభుత్వానికి తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన రెడ్డి ఆదేశాల మేరకు గురువారం పర్చూరులో ఽరైతులకు మద్దతుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంచనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు పర్చూరులోని పార్టీ కార్యాలయం నుంచి బయలు దేరి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటామన్నారు. అధికారులకు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.