
అంతర్ జిల్లా గొర్రెల దొంగల ముఠా అరెస్ట్
అద్దంకి: గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ మొయిన్ తెలిపిన వివరాల మేరకు... కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన చీదరబోయిన రాజేంద్రప్రసాద్ గతంలో గొర్రెల వ్యాపారం చేస్తుండేవాడు. పేకాట ఆడి డబ్బు పోగొట్టుకున్నాడు. ఉన్న ఎకరా భూమి అమ్ముకోవడంతోపాటు అప్పుల పాలయ్యాడు. వ్యాపారం చేసిన ప్రాంతాల్లోనే గొర్రెల దొంగతం చేసి వాటిని విక్రయించి డబ్బు సంపాదించాలని భావించాడు. అదే గ్రామానికి చెందిన ఏసీ మెకానిక్ షేక్ మహ్మద్ రఫీ, కారంచేడులోని కారు సర్వీసింగ్ సెంటరుకు చెందిన మైలా శ్రీనివాసరావు, తనకు పరిచయం ఉన్న మరో వ్యక్తి సన్నెబోయిన శ్రీనివాసరావులతో ముఠా కట్టాడు. బాపట్ల, చీరాల, కారంచేడు, కుంకులమర్రు, అద్దంకి, మార్టూరు, ప్రాంతాల్లో ముందుగా కారులో వెళ్లి రెక్కీ నిర్వహించేవారు. రాత్రి సమయంలో కారులోని సీట్లు తొలగించి అందులో గొర్రెలను ఎత్తుకొచ్చేవారు. వాటిని తమకు తెలిసిన వారి వద్ద ఉంచేవారు. కేసుల దర్యాప్తునకు పోలీసులు బృందాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ మొయిన్ ఆధ్వర్యంలో సీఐ సుబ్బరాజు, ఏఎస్సై వసంతరావు, ఎస్సై నరసింహల ఆధ్వర్యంలో ముఠాను అరెస్ట్ చేశారు. 21 గొర్రెలు, 4 పాట్టేళ్లను, కారును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3.71 లక్షలు ఉంటుందని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ సుబ్బరాజు, ఎస్సై నరసింహ, ఏఎస్సై వసంతరావు తదితరులున్నారు. సీఐ, ఎస్సై బృందానికి ఎస్పీ ప్రకటించిన రివార్డులు అందజేశారు.