
యూరియా సరఫరాపై ఆందోళన వద్దు
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు వెస్ట్: జిల్లాలో యూరియా సరఫరాపై రైతులు అనవసర ఆందోళనతో అవసరానికి మించి నిలువ చేసుకోకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో ఆయన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులతో కలసి వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అధిక వర్షాలు, యూరియా సరఫరాపై అపోహలతో కొంతమంది రైతులు అవసరానికి మించి ముందస్తుగా నిల్వ చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం సరిపడా అందుబాటులో ఉందని, మరికొంత కూడా జిల్లాకు వస్తుందని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగ్గా సరఫరా కోసం ఆఫ్ సీజన్లోనే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాస్తవంగా పంటలు సాగు చేస్తున్న భూ యజమానులకు, కౌలు రైతులకు మాత్రమే యూరియా పంపిణీ జరిగేలా కేంద్ర ప్రభుత్వ యాప్‌లో ఓటీపీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ,రాష్ట్ర వ్యవసాయ అధికారులతో చర్చించనున్నట్లు తెలిపారు.
జిల్లాలో 13వేల భూసార పరీక్షలు
జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు 13వేల భూసార పరీక్షలు చేశామని మంత్రి తెలిపారు. పరీక్షల నిర్వహణ , ఫలితాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని రైతులు తెలియజేశారన్నారు. గ్రామస్థాయిలోనే నిర్వహించి వెంటనే ఫలితాలు అందించేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు నేషనల్ సాయిల్ హెల్త్ మిషన్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ –క్రాప్ బుకింగ్ ఇప్పటి వరకు 58 శాతం మాత్రమే పూర్తయిందని, నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జేసీకి సూచించామని చెప్పారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద జిల్లాలో రైతులు 10 శాతం మంది మాత్రమే నమోదైనట్లు తెలిపారు. ప్రకృతి విపత్తుల సంభవించినప్పుడు బీమాలో నమోదైతే నష్టపరిహారం పొందవచ్చని రైతులందరికీ అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు ఆయన సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కే ఖాజావలి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అయితా నాగేశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, మార్కెఫెడ్ డీఎం నరసింహా రెడ్డి, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజరు హరిగోపాలం, జిల్లా ఉద్యానశాఖ అధికారి రవీంద్రబాబు, ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, పశుసంవర్ధకశాఖ డీడీ సత్యనారాయణ, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.