
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
కుంకలమర్రు (కారంచేడు): రైతులకు అవసరమైన ఎరువులను పోలీస్ బందోబస్తు నడుమ, అదీ అరకొర సరఫరా చేస్తుండడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కుంకలమర్రు గ్రామంలోని సొసైటీ కేంద్రం వద్ద మంగళవారం రైతులకు యూరియా బస్తాలు సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో కేంద్రం వద్దకు రైతులు చేరుకోగా భారీగా పోలీసులను బందోబస్తుగా నియమించి, ఒక్కో రైతుకు కేవలం రెండు యూరియా బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుమీద బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయాధికారులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో 299 మంది రైతులకు 640 బస్తాల యూరియా సరఫరా చేశామని తహసీల్దార్ జి.నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో ఏఓ ఎం.నాగరాజు, పోలీస్ సిబ్బంది, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.