
నేటి నుంచి ఆరోగ్య శిబిరాలు
బాపట్ల అర్బన్: స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ (ఎస్‌ఎన్‌ఎస్‌పీఏ)లో మహిళా ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ తెలిపారు. మంగళవారం బాపట్ల పట్టణంలో ఏరియా వైద్యశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్యవంతమైన మహిళ – శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతో సమగ్ర ఆరోగ్య సేవ కార్యక్రమాలు ఏర్పాటు చేశాయన్నారు. దానిలో భాగంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, జిల్లాలోని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటళ్లలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆయా వ్యాధులకు సంబంధించి మహిళలకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకు పరీక్షలు చేసి వైద్య చికిత్స అందిస్తారని తెలిపారు. అదేవిధంగా గర్భిణులు, కిశోర బాలికలకు పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన చికిత్సలు అందజేయడం జరుగుతుందన్నారు. ఎస్‌ఎన్‌ఎస్‌పీఏ స్టేట్ నోడల్ ఆఫీసర్ బి.వి.రావ్, వైద్యులు పాల్గొన్నారు.