
రైతులందరికీ యూరియా
విడతలవారీగా పంపిణీకి చర్యలు జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ భరోసా దోమల నివారణ చర్యలకు ఆదేశం సూర్యలంక బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్ల పరిశీలన
బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలి
కర్లపాలెం: ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేసిన రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెదగొల్లపాలెం పంచాయతీ పరిధిలోని మార్పు చెన్నాయ్‌వారిపాలెంలో జరుగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. తొలుత మన గ్రోమోర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. అనంతరం ఎంతమంది రైతులకు పంపిణీ చేశారని వ్యవసాయాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. సాగు చేసిన రైతులందరికీ కావలసినంత యూరియా విడతలవారీగా అందజేస్తామని చెప్పారు. ఎకరానికి ఎన్నిసార్లు ఎంతెంత మోతాదులో యూరియా వేస్తారని రైతులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఎంత యూరియా అవసరం ? తదితర అంశాలపై ప్రణాళికలు రూపొందించి సక్రమంగా పంపిణీ చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. తమకు మరుగుదొడ్లు కావాలని, తమ గ్రామానికి సాగునీరు, తాగునీరు సక్రమంగా అందటం లేదని గ్రామస్తులు కలెక్టర్‌కు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో పశువుల పెంపకం ఎక్కువగా ఉన్నందున గోకులం షెడ్లు ఎంతమంది నిర్మించుకున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని, దోమల నివారణకు ఫాగింగ్ చేయించాలని ఎంపీడీవో శ్రీనివాసరావును కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో పి.గ్లోరియా వ్యవసాయ శాఖ ఏడీ అన్నపూర్ణ, ధన్‌రాజ్, ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి సుమంత్‌కుమార్ పాల్గొన్నారు.
సూర్యలంక బీచ్‌లో జరగనున్న బీచ్ ఫెస్టివల్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యలంకలో ఫెస్టివల్‌కు అవసరమైన పనులను బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి ఆయన పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని, పార్కింగ్ ప్రదేశాలను తిలకించారు. ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా రవాణా శాఖ అధికారి పరంధామ రెడ్డి, పౌరసరఫరాల శాఖ డీఎం శివ పార్వతి, డీఎస్‌ఓ జలీల్ భాషా, జిల్లా టూరిజం అధికారి నాగిరెడ్డి, బాపట్ల ఆర్డీవో పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.