
ముందస్తు ప్రణాళికతో వరద ముప్పు నివారణ
ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశాలు
కొల్లూరు: కృష్ణా నదికి వరదలు సంభవించనట్లయితే ప్రాణనష్టం వాటిల్లకుండా కాపాడే విషయంలో ముందస్తు ప్రణాళికలే కీలకమని జిల్లా కలెక్టర్ వి. వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పెసర్లంక అరవింద వారధి వద్ద కృష్ణా నదిలో వరద పరిస్థితిని పరిశీలించారు. అనంతరం కొల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముంపునకు గురయ్యే గ్రామాలలో సహాయక చర్యలు చేపట్టడానికి యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద దిగువకు విడుదల చేసిన అనంతరం జిల్లా పరిధిలోకి ప్రవేశించడానికి పట్టే సమయాన్ని అంచనా వేసుకొని పనులు చేపట్టడం కంటే ముందు జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకొని చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది కృష్ణా నదికి 11.42 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పెను విపత్తు ఏర్పడిన సంఘటనలను గుర్తుంచుకోవాలన్నారు. వరద పెరిగి గ్రామాలను చుట్టుముట్టే ప్రమాదం ఉన్నట్లయితే లంక గ్రామాల ప్రజలను ముందుగానే పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సేవలకు అవసరమైన ఏర్పాట్లను విస్తృతపరచాలని కోరారు. వరద తీవ్రతను బట్టి జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బాధిత ప్రజలు ఇబ్బంది ఎదురైతే కంట్రోల్ రూమ్‌లకు సమాచారం అందించి సురక్షితంగా ఉండాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలను కాపాడాలంలే సమన్వయం ముఖ్యమని చెప్పారు. జిల్లా, డివిజన్, మండల అధికారులు క్రమ పద్ధతిలో ఉన్నత స్థాయి నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తూ విధులు నిర్వహించిన పక్షంలో వరద ప్రమాదం నుంచి ప్రజలను కాపాడగలుగుతామని పేర్కొన్నారు. ప్రతి అధికారి తాము వరద ముంపు బారిన పడితే ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఊహించుకొని, ఆ కష్టం ప్రజలకు ఎదురవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విపత్తు సంభవించకముందే నష్ట తీవ్రతను తగ్గించడానికి ప్రణాళికలతో ముందడుగు వేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.