
జాతీయ రహదారిపై లారీలో మంటలు
దాదాపు రూ.10 లక్షల ఆస్తి నష్టం
యడ్లపాడు: జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న అశోక్ లేలాండ్ మినీ లారీ అగ్ని ప్రమాదానికి గురై పాక్షికంగా దగ్ధమైంది. ఈ ఘటనలో దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. సమయానికి అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, మంటలు పెద్దగా వ్యాపించకుండా వేస్ట్ కాటన్ లోడును కాపాడగలిగారు. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వేస్ట్ కాటన్ లోడుతో వెళ్తున్న లారీ శనివారం అర్ధరాత్రి దాటాక 2.35 గంటల సమయంలో మండలంలోని వంకాయలపాడు సమీపంలోకి చేరుకుంది. ఇంతలో ఒక్కసారిగా ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున వ్యాపించాయి. లారీ డ్రైవర్ కిందకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది సంఘటనా దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీ ఇంజిన్ భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ బ్యాటరీల నుంచి షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ప్రమాదం సంభవించిందని తెలిపారు. మంటలకు ఆహుతి కాకుండా దాదాపు రూ.10 లక్షల విలువైన వేస్ట్ కాటన్‌ను రక్షించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది ఆర్ మాణిక్యరావు, కె.పవన్‌కుమార్, ఇ.ప్రభాకరరెడ్డి, కె.నరసరాజు పాల్గొన్నారు.
రాచనగరు
రహదారులు ఛిద్రం
తాడికొండ: రాజధాని అమరావతికి వెళ్లే ప్రధాన రహదారులు ఛిద్రం అయ్యాయి. అటు ప్రయాణికులు ఇటు వీఐపీలు, వీవీఐపీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు రాజధాని ప్రాంతం ముంపునకు గురైంది. వాగులు ఉప్పొంగాయి. నీరు నిలిచి ప్రధాన రహదారి గుంతల మయంగా తయారైంది. పెదపరిమి నుంచి తుళ్లూరు వరకు ఏర్పడిన భారీ గుంతలు అటు వాహనదారులు, ఇటు నిత్యం రాజధానికి రాకపోకలు సాగించే సచివాలయ, హైకోర్టు ఉద్యోగులు, జడ్జీలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. నెల రోజులుగా ఈ దుస్థితి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం గుంతలలో ఫ్లైయాష్ డస్ట్ కూడా వేసిన దాఖలాలు లేని కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రాచనగరుకు వెళ్లే రహదారులకు కనీస మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు.
ఐజీని కలిసిన జిల్లా ఎస్పీ
నగరంపాలెం: స్థానిక కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠిని ఆదివారం గుంటూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందించారు. సమర్థంగా విధులు నిర్వర్తించి, ప్రజలకు పోలీస్ సేవలు అందించాలని ఐజీ జిల్లా ఎస్పీకి సూచించారు.
పశ్చిమ డెల్టాకు 5,009 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 5,009 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి నీటి విడుదల నిలిపివేశారు. బ్యాంక్ కెనాల్‌కు 988 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 342, పశ్చివ కాలువకు 131, నిజాపట్నం కాలువకు 297, కొమ్మూరు కాలువకు 1,483 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,57,250 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

జాతీయ రహదారిపై లారీలో మంటలు

జాతీయ రహదారిపై లారీలో మంటలు