
గంజాయి రహితంగా జిల్లా మార్పు
తీరప్రాంతాల్లో పటిష్టమైన చర్యలు చేపడతాం మహిళలు, చిన్నపిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాధ్యతలు చేపట్టిన ఎస్పీ
బాపట్లటౌన్: బాపట్ల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. బాపట్ల జిల్లా ఎస్పీగా బి.ఉమామహేశ్వర్ ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు చేపట్టారు. తొలిసారిగా జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి జిల్లా పోలీస్ కార్యాలయం సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పోలీస్ పరేడ్‌తో ఆహ్వానించారు. బాధ్యతల స్వీకారం అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రజలకు నిష్పక్షపాతమైన సేవలు అందిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామన్నారు. మహిళలకు, చిన్నపిల్లలకు సంబంధించిన నేరాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పెండింగ్ కేసుల విచారణలో సాంకేతికతను జోడించి వేగంగా దర్యాప్తు చేస్తామన్నారు. సముద్రతీర ప్రాంతంలో భద్రత చర్యలపై మరింత దృష్టి పెడతామని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా పోలీస్‌స్టేషన్‌కి వచ్చి వారి సమస్యలు చెప్పుకొనే విధంగా చూస్తామన్నారు. మాదక ద్రవ్యాల కట్టడి చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాబోయే రోజుల్లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలియపరచడానికి హెల్ప్ లైన్ నెంబర్‌ను ప్రారంభిస్తామన్నారు. జిల్లా ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించిన సమాచారం పోలీస్ శాఖకు అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు.
పోలీస్ అధికారులతో సమీక్ష
అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తొలుత జిల్లాలోని నేరాలపై సమీక్షించారు. ఇప్పటివరకు నేరాలు జరిగిన తీరు..ఏ తరహా కేసులు ఈ ప్రాంతంలో అధికంగా నమోదవుతుంటాయనే విషయాలపై ఆరా తీశారు. సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ పోలీస్‌శాఖ పేరు ప్రఖ్యాతలు సాధించేలా పనిచేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, చిన్నారులు, మహిళలపై దాడులకు పాల్పడే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు విజిబుల్ పోలీసింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విధులను నిబద్ధతతో నిర్వర్తించాలన్నారు. తీర ప్రాంతంలో గస్తీ మరింత పెంచాలన్నారు. ఎలాంటి సమస్యతో బాధితులు స్టేషన్‌కు వచ్చినా తక్షణమే స్పందించి వారికి సహాయం చేయాలన్నారు. తక్షణమే స్పందించడం ద్వారా నేరాలను ఆదిలోనే అరికట్టవచ్చన్నారు. ఈ సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్‌నాయక్, రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారధి, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.