
రైతుల ఖాతాల్లో బర్లీ పొగాకు సొమ్ము
మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ
జె.పంగులూరు: అద్దంకి నియోజక వర్గంలో ఇప్పటివరకు 1,856 మంది రైతుల నుంచి 2,148 టన్నుల బర్లీ పొగాకు కొనుగోలు చేశామని మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ తెలిపారు. మండలంలోని బూదవాడలో శుక్రవారం ఆమె మాట్లాడారు. జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 17 వేల టన్నుల పొగాకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులకు ఇప్పటి వరకు రూ. 127 కోట్లు ఇవ్వాలని, ఇప్పటికే రూ. 90 కోట్ల వరకు వారి ఖాతాలో జమయ్యాయని తెలిపారు. ఇంకా రూ. 37 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని ఆమె తెలిపారు. పంగులూరు మండలంలో 782 మంది రైతుల వద్ద 990 టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. సోమవారం నుంచి పంగులూరు మండలానికి చెందిన రైతుల పొగాకును గుంటూరులో కొనుగోలు చేస్తామని, వారంతా అక్కడకు తీసుకురావాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి డి.సుబ్బారెడ్డి, నరసింహారావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.