
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతి లాల్ దండే
బాపట్ల: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతి లాల్ దండే పేర్కొన్నారు. గురువారం బాపట్ల మండలం నగరవనంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, అటవీ శాఖ సలహాదారులు మల్లికార్జున, ఎంపీ కృష్ణ ప్రసాద్‌లతో కలసి జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. కాంతి లాల్ దండే ముఖ్య అతిథిగా మాట్లాడుతూ అటవీ శాఖలో సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయారని, వారి కుటుంబాలకు అటవీ శాఖ సపోర్టుగాఉండాలన్నారు. కుటుంబ సభ్యులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చూచించారు. అటవీ శాఖలో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి సేవలను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుంగా పనిచేయాలన్నారు. అటవీ అమరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖపై ఉందన్నారు. అటవీ భూములను రక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు గ్రామాలలో చెట్లను నరికివేయడంతో పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. ఇలాంటి పనుల వలన విజయవాడలో వరదలు వచ్చాయని చెప్పారు. ప్రకృతిని కాపాడితే భవిష్యత్తు తరాలు బాగుంటాయని పేర్కొన్నారు. ఎనిమిది మంది అమరుల సేవలను కొనియాడారు. వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అంతకుముందు నగరవనంలోని జాతీయ అటవీ అమరవీరుల స్మారక స్తూపాన్ని అధికారులు ప్రారంభించారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పి.వి.చలపతి, రాహుల్ పాంటు, శాంతిప్రియ పాంటే, శరవణన్, ఐ.కె.వి. రాజు, చైతన్య కుమార్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి తదితరులు పాల్గొన్నారు.