
గ్రానైట్ లారీ ఢీ– కార్మికుడికి తీవ్ర గాయాలు
బల్లికురవ: బైక్‌పై వెళుతున్న గ్రానైట్ కార్మికుడిని వెనుక నుంచి వేగంగా వచ్చిన గ్రానైట్ లారీ ఢీ కొట్టటంతో తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటన గురువారం రాత్రి బల్లికురవ–సంతమాగులూరు ఆర్‌అండ్‌బీ రోడ్డులోని మల్లాయపాలెం, కొప్పరపాలెం గ్రామాల మధ్య జరిగింది. అందిన సమాచారం ప్రకారం మల్లాయపాలెం గ్రామానికి చెందిన పల్లెపోగు పోతురాజు స్థానిక గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని పని నిమిత్తం బైకుపై కొప్పరపాడు గ్రామం వెళుతున్నాడు. ఈర్లకొండ నుంచి గ్రాౖనైట్ రాళ్లతో సంతమాగులూరు వైపు వెళుతున్న లారీ పోతురాజు బైకును ఢీకొట్టటంతో రోడ్డు మార్జిన్‌లో పడిపోయాడు. కొందరు గమనించి రోడ్డు మీదకు చేర్చి 108కి సమాచారం ఇచ్చారు. బాధితుడిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. కాగా లారీ ఆగకుండానే వెళ్లిపోయింది.