
కన్నతండ్రే కర్కోటకుడు
ఇద్దరు బిడ్డలను రైల్వేస్టేషన్‌లో వదిలేసి వెళ్లిన తండ్రి మద్యానికి బానిసై రోజుల బిడ్డను అమ్మేసిన వైనం భార్యను హింసిస్తూ సంతానాన్ని వదిలించుకునే ప్రయత్నం
చినగంజాం: కట్టుకున్న భార్యను పిల్లలు కనే యంత్రంలా మార్చి ఆరుగురు పిల్లలను కని కుటుంబాన్ని పోషించే సత్తా లేక మద్యానికి బానిసై భార్యను తీవ్రమైన హింసకు గురి చేస్తూ కన్న బిడ్డలను సైతం అమ్మేసుకొని, తన వద్ద ఉన్న బిడ్డలను వదలించుకొని పరారయ్యాడు ఒక ప్రబుద్ధుడు. దీనికి సంబంధించి అతని భార్య చిన్నారి తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం చింతపల్లికి చెందిన పంగి రాజు, చిన్నారిలకు సుమారు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. కూలి పనులు చేసుకొని జీవించే వారికి మొదటి సంతానం మగ పిల్లవాడు సాయి కలుగగా ప్రసవ సమయంలో వైద్యులను సంప్రదించకుండా ఆమెకు భర్త రాజు తనే స్వయంగా బొడ్డు కోసి ప్రసవం చేశాడు. అటు తరువాత చినగంజాం మండలంలో రొయ్యల చెరువుల్లో కూలి పనుల కోసం శంకర్ అనే మధ్యవర్తి ద్వారా ఇక్కడికి వచ్చారు. మండలంలోని పెదగంజాం ప్రాంతంలోను, కొత్తపట్నం మండలం ఈతముక్కల వద్ద రొయ్యల చెరువుల దగ్గర పనిచేస్తూ 12 ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వారికి మొదటి బిడ్డ సాయి తరువాత రెండో సంతానం ప్రవీణ్, మూడో సంతానంగా ఇంకా పేరు పెట్టని మరో ఆడ బిడ్డ, నాలుగో సంతానంగా మగపిల్లవాడు లడ్డు, ఐదో సంతానంగా ఆడపిల్ల లల్లి జన్మించారు. వీరిలో మొదటి బిడ్డ సాయిని చినగంజాం మండలంలోని గొల్లపాలెం వద్ద పనిలో కుదుర్చగా, రెండో వాడు ప్రవీణ్‌ను అడవీధిపాలెంలో పనికి కుదిర్చాడు. మూడో సంతానం ఆడపిల్లని నడిచే వయస్సులో ఈతముక్కల వద్ద వేరొకరికి అమ్మేశాడు. ఇదేమని ప్రశ్నించి అడ్డుకోబోయిన భార్య చిన్నారిని గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. భర్త పెట్టే బాధలను భరిస్తూ అతని వద్దే ఉంటూ సంతానం కనిపెట్టే యంత్రంలా తయారైంది. ప్రస్తుతం చినగంజాం మండలంలోని పెదగంజాం చెరువులు వద్ద కూలి పని చేసుకుంటూ భార్యభర్తలు, ఇద్దరు సంతానం జీవిస్తున్నారు. వారికి ఇటీవల మరో ఆడపిల్ల జన్మించింది. మద్యానికి బానిసై కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేదని రాజు గ్రహించి 24 రోజుల పసి గుడ్డును రూ.30 వేలు నగదు తీసుకొని తల్లికి తెలియకుండా అమ్మేశాడు. ఆరుగురు సంతానానికి ఆస్పత్రి వెళ్లకుండా తనే స్వయంగా ప్రసవం చేయడం గమనార్హం.
ఇద్దరు చిన్నారులను రైల్వేస్టేషన్‌లో వదిలి వెళ్లి..
తన సంతానంలో తన దగ్గర మిగిలి ఉన్న ఇద్దరు చిన్నారులను వారం రోజుల క్రితం తను నివాసముంటున్న చెరువుల దగ్గర ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చాడు. భార్య అడ్డగిస్తుందేమోనని నిద్రిస్తున్న భార్యను మంచానికి కట్టేసి తన ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వచ్చేశాడు. మంగళవారం ఉదయం పిల్లలు లల్లి, లడ్డులను చినగంజాం రైల్వేస్టేషన్‌లో వదిలివేసి ఎటో పరారై వెళ్లిపోయాడు. రైలు పట్టాలను దాటుతూ రైల్వే ప్లాట్‌ఫాం ఎక్కే ప్రయత్నం చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న చిన్నారులను రైల్వే కీమాన్ గుర్తించి స్థానికంగా నివాసముండే మల్లీశ్వరి అనే మహిళకు అప్పగించి వెళ్లిపోయాడు. సదరు మహిళ స్థానికుల సాయంతో ఆ ఇద్దరు చిన్నారులకు స్నానం చేయించి, మంచి దుస్తులు ఇచ్చి భోజనం పెట్టి అటు తరువాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారుల సమాచారాన్ని మండలంలోని పలు ప్రాంతాల్లో విచారించారు. తన ఇద్దరు సంతానం చినగంజాం రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారని సమాచారం అందుకున్న తల్లి చిన్నారి బుధవారం తెల్లవారు జామున వారి దగ్గరకు వచ్చి అక్కున చేర్చుకుంది.
తల్లీబిడ్డలకు సాయమందించిన సర్పంచ్
సంఘటన కొత్తపాలెం పంచాయతీ పరిధిలో చోటు చేసుకోవడంతో గ్రామ సర్పంచ్ ఆసోది బ్రహ్మానందరెడ్డి వెంటనే స్పందించారు. తల్లి బిడ్డలను కలుసుకొని పూర్తిగా విషయాన్ని చిన్నారుల తల్లి చిన్నారి నుంచి తెలుసుకొని వారికి భోజనపు ఖర్చులు నిమిత్తం నగదు సాయమందించడమే కాకుండా అధికారులు దృష్టికి విషయం తీసుకొని వెళ్లి మిగిలిన సంతానాన్ని కూడా ఆమె చెంతకు చేర్చి వారందరికీ న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీనిపై సమాచారం అందుకున్న జిల్లా చైల్డ్‌లైన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పురుషోత్తం మాట్లాడుతూ ఈ ఘటనపై బాధితులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, చిన్నారులను వదిలిపెట్టి వెళ్లిన తండ్రి ఆచూకీ తెలుసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.