
పోలీసులు ప్రతిష్ట దిగజార్చుకుంటున్నారు
న్యాయవాదులపై నమోదు చేస్తున్న తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి
చీరాలలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
చీరాల – వాడరేవు రహదారిపై ఆందోళన
చీరాల రూరల్: సామాన్యులపై, న్యాయవాదులపై పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ.. వారి ప్రతిష్టను వారే దిగజార్చుకుంటున్నారని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. చీరాలకు చెందిన న్యాయవాది ఆకుల కొండయ్యపై జె. పంగులూరు పోలీసులు పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా బుధవారం న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి కోర్టు ఎదుటనున్న చీరాల–వాడరేవు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గౌరవ రమేష్‌బాబు, మేరుగ రవికుమార్, సీనియర్ న్యాయవాది బండారుపల్లి హేమంత్ కుమార్ మాట్లాడారు. చీరాల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాది కొండయ్యపై టీడీపీ నాయకుడు గుంటూరు మాధవరావు జె.పంగులూరు పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు ఎటువంటి విచారణ చేయకుండా న్యాయవాదిపై కేసు నమోదు చేశారని చెప్పారు. న్యాయవాది కొండయ్యపై మాధవరావు ఫిర్యాదు చేసిన రోజున కొండయ్య చీరాలలోనే ఉన్నాడని సీసీ ఫుటేజీలో కూడా ఉందన్నారు. అయినప్పటికీ పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండా తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. తక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి న్యాయవాదిపై నమోదు చేసిన తప్పుడు కేసును తీసివేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో న్యాయవాదుల పట్ల పోలీసులు ప్రదర్శిస్తున్న తీరు సక్రమంగా లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కక్షిదారుల తరఫున పోలీసు స్టేషన్‌కు వెళుతూ న్యాయసహాయం అందిస్తున్న న్యాయవాదులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని న్యాయవాదులు వాపోయారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ్లమూడి విజయకుమార్, సీనియర్ న్యాయవాదులు కాకాని వెంకట్రావు, టీజే సాయిబాబు, పీఎన్‌ఎల్‌వీ ప్రసాద్, ఆకిశెట్టి పుల్లయ్యనాయుడు, సజ్జా శ్రీనివాసరావు, రాజు వెంకటేశ్వరెడ్డి, భానుప్రకాష్, గొడుగుల గంగరాజు, చల్లా సురేష్, కొటిక ఉదయభాస్కరరావు, నాశన రాము, షేక్ సిరాజ్, మహిళా న్యాయవాదులు స్నేహ, ఈశ్వరిరెడ్డి, పద్మ పాల్గొన్నారు.