
అరకు కాఫీ తోటల పరిశీలన
బాపట్ల: కాఫీ పంటకు అత్యంత హానికరమైన కాఫీ బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి స్థితిని అంచనా వేయడానికి బాపట్ల వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన బృందం అరకులో పరిశోధన చేస్తున్నట్లు వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి తెలిపారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు, కీటక శాస్త్ర ఆచార్యులు డా. టి.మధుమతి, పేథాలజీ విభాగ ఆచార్యులు డా.జి.వంశీకృష్ణ, ఉద్యానవన విభాగ ఆచార్యులు డా.సిహెచ్. దుర్గా హేమంత్ కుమార్ మార్గదర్శకత్వంలో 25 మంది ఎమ్మెస్సీ వ్యవసాయ విద్యార్థులతో ఈ బృందం సర్వే చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆఫ్రికాకు చెందిన ఈ చిన్న బీటిల్ పురుగు కాఫీకి అత్యంత హానికరమైనదని, ఇది కాఫీ ఉత్పత్తుల నాణ్యతలను, దిగుబడిని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక నష్టాన్ని కలగజేస్తుందని డా.ఎస్.ఆర్.కోటేశ్వరరావు తెలిపారు. కాఫీ గింజలో తన జీవిత చక్రాన్ని పూర్తి చేయగల ఏకై క కీటకమని, ఇది ప్రపంచంలో కాఫీని ఉత్పత్తి చేసే అనేక దేశాలను ఆక్రమించిందని, రైతులకు దీని నివారణకు తగిన శిక్షణ లేకపోవడం పొలాల పేలవమైన నిర్వహణ ఈ తెగులు వ్యాప్తికి కారణమన్నారు.
పంటలో నష్టం కలిగిస్తున్న బెర్రీ బోరర్ పురుగు వ్యాప్తి స్థితిపై అంచనా