
రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: రెడ్ క్రాస్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జరిగింది. బాపట్ల జిల్లాగా ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై సంస్థ జిల్లా చైర్మన్ బీఎస్ నారాయణ భట్టు స్పష్టమైన నివేదికలను సమర్పించారు. కమిటీ ఆమోదించిన తదుపరి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా విశేష సేవలు అందించిన 18 మంది సభ్యులకు కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు, జ్ఞాపకాలను అందించారు. నూతన పాలక మండలి ఎన్నికలు జరగ్గా, 11 మంది పాలకవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. చైర్మన్‌గా బి.ఎస్.నారాయణ భట్టు మరోసారి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బి.రామ సుబ్బారావు, కోశాధికారిగా టి.ప్రసాదరెడ్డి ఎన్నిక కాగా మరో తొమ్మిది మంది సభ్యులుగా ఎన్నికై నట్లు కలెక్టర్ ప్రకటించారు. నూతన పాలకవర్గం సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. మంచి సేవలు అందిస్తున్న సంస్థ ప్రతినిధులను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ అభినందించారు. రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర కోశాధికారి పి.రామచంద్రారాజు, సంస్థ చైర్మన్ బి.ఎస్.నారాయణ భట్టు మాట్లాడారు. కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.