ప్రాణాపాయంలో చిన్నారి | - | Sakshi
Sakshi News home page

ప్రాణాపాయంలో చిన్నారి

Sep 11 2025 2:38 AM | Updated on Sep 11 2025 2:38 AM

ప్రాణాపాయంలో చిన్నారి

ప్రాణాపాయంలో చిన్నారి

పర్చూరు(చినగంజాం): బ్రెయిన్‌ ఫీవర్‌ సోకడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడో చిన్నారి. కొద్దిరోజులుగా చికిత్స అందిస్తున్నప్పటికీ స్పృహలోకి రాకపోవడంతో మరికొన్ని రోజులు చికిత్స తప్పదంటున్నారు వైద్యులు. వివరాల్లోకి వెళితే.. పర్చూరు మండలంలోని చెన్నుంబొట్ల అగ్రహారానికి చెందిన పేర్లి సాత్విక్‌, సోదరి సంజనలు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. వారి తండ్రి పేర్లి సురేష్‌ వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. ఈక్రమంలో సెప్టెంబర్‌ 5న సాత్విక్‌కు తీవ్రమైన జ్వరం సోకి ఫిట్స్‌ రావడంతో చిలకలూరిపేటలోని వైద్యశాలలో చేర్పించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు తీసుకెళ్లాలని సూచించారు.

రోజుకు రూ.25వేలు విలువైన ఇంజక్షన్‌

గుంటూరులోని ఓ ప్రైవేటు పిల్లల హాస్పిటల్‌లో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు బాలుడికి బ్రెయిన్‌ ఫీవర్‌ సోకిందని తెలిపారు. రోజుకు రూ. 25 వేలు విలువైన ఇంజక్షన్‌ చేస్తే నయం చేయవచ్చని వైద్యులు సలహా ఇచ్చారు. పేద కుటుంబం కావడంతో దిక్కుతోచని బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రాణాలు నిలపాలని వేడుకోలు

సాత్విక్‌ వైద్య ఖర్చుల కోసం అవసరమైన ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న విషయం పలువురు తెలుసుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు గనిపిశెట్టి గోవిందరావు తమ విద్యార్థి సాత్విక్‌ పరిస్థితిని తెలుసుకొని గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలోని ఉపాధ్యాయ గ్రూపులను, ఉద్యోగులను, గ్రామస్తులను సంప్రదించి వారిని చైతన్యపరచి రూ. 1.91 లక్షలు నగదు వసూలు చేసి బాలుడి వైద్యఖర్చుల నిమిత్తం అందజేశారు. బాలుడు కోలుకునేందుకు ఇంకా నగదు అవసరం కావడంతో బాలుడి తల్లిదండ్రులు దాతలసాయం కోసం ఎదురు చూస్తున్నారు. సాయం అందించేందుకు దాతలు పాఠశాల ఉపాధ్యాయుడు గనిపిశెట్టి గోవిందరావును సంప్రదించాలని కోరుతున్నారు.

బ్రెయిన్‌ ఫీవర్‌తో మృత్యువుతో పోరాటం

ఆర్థిక స్థోమత లేక నిస్సహాయ స్థితిలో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు

కొంతమేర సాయం చేసిన గ్రామస్తులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు

పూర్తిగా కోలుకునేందుకు మరికొన్ని రోజులు వైద్యం చేయాలంటున్న డాక్టర్‌లు

దాతల సాయానికై ఎదురు చూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement