
బస్సుల రద్దుతో ఇక్కట్లు
● అనంతపురం సూపర్ సిక్స్
సభకు తరలిన బస్సులు
● మూడు రోజులపాటు సర్వీసులు
అందుబాటులో లేనట్లే..
బల్లికురవ: సూపర్‌సిక్స్ సంబరాల పేరిట పల్లె వెలుగు బస్సులను అనంతపురం సభకు పంపటంతో మంగళవారం నుంచి బల్లికురవ – సంతమాగులూరు మండలాలో తిరిగే సింగల్ రూట్ బస్సు సర్వీసులకు బ్రేక్ పడింది. అద్దంకి డిపో నుంచి బల్లికురవ, సంతమాగులూరు మీదుగా నరసరావుపేట వెళ్లే బస్సు, గోవాడ మార్టూరు మీదుగా చిలకలూరిపేట వెళ్లే బస్సు, వైదన బల్లికురవ మీదుగా చిలకలూరిపేట వెళ్లే బస్సు, మైలవరం బస్సు, చిలకలూరిపేట డిపో నుంచి మర్టూరు, బల్లికురవ, కొమ్మాలపాడు మీదుగా కుందుర్రు వెళ్లే బస్సు, చిలకలూరి పేట నుంచి ఉప్పుమాగులూరు వెళ్లే బస్సులను రద్దు చేశారు. అద్దంకి నుంచి కొమ్మాలపాడు మీదుగా నరసరావుపేట, అద్దంకి నుంచి కూకట్లపల్లి మీదుగా వినుకొండ వెళ్లే బస్సులకు కోత విధించారు. బుధవారం అనంతపురం సమీపంలోని జీఎంఆర్, ఇంద్రప్రస్థ గ్రౌండ్స్‌లో జరగనున్న సూపర్‌సిక్స్ సంబరాలకు అద్దంకి, చిలకలూరిపేట, వినుకొండ డిపోలనుంచి పల్లె వెలుగు బస్సులు తరలించడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం వరకు ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. మహిళలకు సీ్త్రశక్తి పేరిట ఉచిత ప్రయాణం అంటూ అరకొర బస్సులు కేటాయించగా.. వాటిని సైతం అనంతపురం పంపడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని 15 గ్రామాల ప్రయాణికులు కుందుర్రు బస్సును రద్దు చేయడంపై డిపో మేనేజర్‌తో మాట్లాడటంతో మంగళవారం సాయంత్రం పునరుద్ధరించారు. అయితే బుధ, గురువారాల్లో యథావిధిగా నడపాలని ప్రయాణిలు కోరుతున్నారు.