
అన్నదాతను దగా చేసిన ప్రభుత్వం
రేపల్లె: రాష్ట్రంలోని కూటమి సర్కారు రైతులను దగా చేసిందని శాసనమండలి సభ్యుడు, వైఎస్సార్ సీపీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు తుమాటి మాధవరావు అన్నారు. వైఎస్సార్ సీపీ అధినాయకత్వం పిలుపు మేరకు రేపల్లె, వేమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు డాక్టర్ ఈవూరు గణేష్, వరికూటి అశోక్‌బాబుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాత పోరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇసుకపల్లి నుంచి రెండు నియోజకవర్గాల రైతులు, కౌలు రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలి వచ్చి రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మికి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
● అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాధవరావు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులకు విత్తుకునే విత్తనం నుంచి సకాలంలో ఎరువులు, పురుగుమందులను రైతుభరోసా కేంద్రాల ద్వారా అందించారన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకున్నారని తెలిపారు. దానికి భిన్నంగా నేటి కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. నేడు ఒక్క కట్ట యూరియా కోసం ఎర్రటెండలో బారులు తీరి ఉండాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయం కూడా పూర్తిగా ఇవ్వకుండా రైతాంగాన్ని దగా చేశారన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అందిస్తామని చెప్పి, ఒక్క సిలిండర్‌తో సరిపెట్టారని, మహిళలకు ఉచిత బస్సు అని ప్రవేశపెట్టి నెల కావస్తున్నా.. తగినన్ని బస్సులు అందుబాటులో లేకుండా మోసం చేశారన్నారు.
● ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగులకు సైతం వికలాంగత్వం పర్సంటేజ్ వ్యత్యాసం ఉందని లక్షలాది మందికి పింఛన్ ఎత్తేసే కుట్రకు తెర లేపిన దుర్మార్గ ప్రభుత్వమిది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, పింఛన్‌దారులు, మహిళలు, అన్నివర్గాల వారు ఇక్కట్లకు గురవుతుంటే.. కూటమి నేతలు విజయోత్సపు సభలు నిర్వహించడం విడ్డూరమన్నారు. రైతులు, నాయకులు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనీల్, దుండి వెంకటకామిరెడ్డి, యార్లగడ్డ రాంబాబు, చిత్రాల ఓబేదు, చిమటా బాలాజీ, వీసం నాగలక్ష్మి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు