
రేపల్లెకు భారీ బైక్ ర్యాలీ
భట్టిప్రోలు: కూటమి ప్రభుత్వంలో రైతులకు ఆదినుంచి కష్టాలేనని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయ కర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. అశోక్‌బాబు ఆధ్వర్యంలో అన్నదాత పోరు సందర్భంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు భట్టిప్రోలు మండలం వేమవరం అడ్డరోడ్డు నుంచి పల్లెకోన మీదుగా రేపల్లె వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరు, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తలు అశోక్‌బాబు, ఈపూరు గణేష్‌బాబు మాట్లాడుతూ పంటలకు గిట్టుబాటు ధరలు, ఎరువులు బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు రైతే రాష్ట్రానికి వెన్నుముక అని పొగిడిన కూటమి నేతలు.. ఎన్నికలయ్యాక రైతులకు వెన్నుపోటు పొడిచారన్నారు. అనంతరం ఆర్డీఓ నాగలక్ష్మికు వినతి పత్రం అందచేశారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గంలోని భట్టిప్రోలు, వేమూరు, చుండూరు, అమృతలూరు, కొల్లూరు, రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పార్టీ మండల కన్వీనర్లు, అన్ని మండలాల్లోని రాష్ట్ర జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, రైతు సోదరులు పాల్గొన్నారు.