
రైతులను నట్టేట ముంచిన చంద్రబాబు
కనీస అవగాహన లేని వారికి
మంత్రి పదవులు
అన్నదాతల వెన్నంటి ఉండే పార్టీ
వైఎస్సార్‌సీపీ
మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
9న ‘అన్నదాత పోరు’ జయప్రదానికి పిలుపు
బాపట్ల: రైతులను చంద్రబాబు సర్కారు అన్నివిధాలుగా నట్టేట ముంచిందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ‘అన్నదాత పోరు’ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని రెవెన్యూ డివిజన్లలో నిరసన ప్రదర్శన, ఆర్డీఓలకు వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమ పోస్టరును ఆదివారం స్థానిక కోన చాంబర్‌లో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ... చంద్రబాబు సర్కారు వచ్చాక పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదన్నారు. ౖరైతులకు రూ.20 వేలు ఇస్తామని చెప్పి ఆయన మోసం చేశారని గుర్తు చేశారు. కనీస అవగాహన లేని అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి ఇచ్చి రైతులను అయోమయానికి గురి చేశారన్నారు. రైతులను ఎరువుల కోసం క్యూలో నిలబెడితే తప్పేంటంటూ పేర్కొనడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు.
వైఎస్ జగన్ హయాంలో మేలు
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతుల పట్ల ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గుర్తుచేశారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయటంతోపాటు శాశ్వత ఉద్యోగులను కూడా నియమించారన్నారు. రైతులను నేరుగా సేవలు అందేలా కృషి చేశారని గుర్తు చేశారు. ఈ క్రాప్ బుకింగ్‌లు కూడా వెనువెంటనే చేయటంతోపాటు రూ.730 కోట్లు రైతులకు సంబంధించిన బీమా రుసుము కూడా చెల్లించారని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనం నుంచి దిగుబడి వరకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా ఆయన వ్యవహరించారన్నారు. నేడు రైతులు యూరియా కోసం బారులుతీరాల్సిన దుస్థితి నెలకొందన్నారు. యూరియా అవసరం లేని పర్చూరు నియోజకవర్గంలో టన్నుల కొద్ది యూరియా ఉంటే, అవసరమైన ప్రాంతాల్లో లేదన్నారు. అధికారులు కూడా యూరియా బ్లాక్‌లోకి వెళ్లినా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
‘అన్నదాత పోరు’ జయప్రదానికి పిలుపు
ఈ నెల 9వ తేదీన రైతులకు అండగా అన్నదాత పోరు కార్యక్రమం ఉదయం 9.30 గంటలకు ఉంటుందని కోన చెప్పారు. ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, జాలి రామిరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, రెడ్డింకయ్య, ఇనగలూరి మాల్యాద్రి, తన్నీరు అంకమ్మరావు, మండే విజయకుమార్, చెన్నకేశవులు, జోగి రాజా, శ్రీహరి ప్రకాశ్, అడే చందు తదితరులు పాల్గొన్నారు.