
చీరాల టౌన్: చీరాల డివిజన్ పరిధిలో పంటలు సాగు చేసే ప్రతి రైతుకు అవసరమైన యూరియా అందించేందుకు కృషి చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు తెలిపారు. ఆదివారం చీరాల మండలంలోని గవినివారిపాలెం, తోటవారిపాలెం, తదితర గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలు, ఫర్టిలైజర్ షాపుల్లో యూరియా నిల్వలను ఆర్డీవో చంద్రశేఖర నాయుడు, తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణలు వ్యవసాయాధికారులతో కలిసి పరిశీలించారు. ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్ నిల్వలను, రికార్డులను, యూరియా పంపిణీ విధానాన్ని తెలుసుకున్నారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. అధిక ధరలకు విక్రయించకుండా, అక్రమ నిల్వలు చేయకుండా కట్టడి చేశామన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిత్యాన్నదానానికి సామగ్రి వితరణ
మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి నిత్యాన్నదానికి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామస్తుడు గండే కృష్ణమ నాయుడు, మౌనిక దంపతులు సామగ్రి వితరణ చేశారు. తమ చిన్నారులు త్రిషికదేవి, నిహిరదేవి పేరిట 200 కుర్చీలు, వెయ్యి గ్లాసులు, 15 ఐరన్ టేబుళ్లు బహూకరించారు. ఆదివారం ఉదయం స్వామిని దర్శించుకున్న వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావుకు వీటిని అందజేశారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
సజావుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎంపిక పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం గుంటూరులోని వివిధ పరీక్ష కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ఏసీ కళాశాల, టీజేపీఎస్, విజ్ఞాన్ నిరూల డిగ్రీ, పీజీ కళాశాలలోని పరీక్ష కేంద్రాల్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పరిశీలించారు.
పశ్చిమ డెల్టాకు 8,216 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 8,216 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 340, బ్యాంక్ కెనాల్‌కు 1,930, తూర్పు కాలువకు 720, పశ్చిమ కాలువకు 241, నిజాపట్నం కాలువకు 454, కొమ్మూరు కాలువకు 3,420, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 53,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: 12వ వేతన సవరణకు సంబంధించిన సంఘాన్ని నియమించాలని ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసెఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.