తక్కువ ధరకు బంగారమంటూ మోసం | - | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

Sep 9 2025 1:41 PM | Updated on Sep 9 2025 1:41 PM

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

● కర్ణాటక వ్యాపారికి ముఠా కుచ్చుటోపీ ● రూ.14 లక్షల నగదు దోచుకుని పరారీ ● నిందితులను అరెస్టు చేసిన చీరాల పోలీసులు

● కర్ణాటక వ్యాపారికి ముఠా కుచ్చుటోపీ ● రూ.14 లక్షల నగదు దోచుకుని పరారీ ● నిందితులను అరెస్టు చేసిన చీరాల పోలీసులు

చీరాల అర్బన్‌: తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని మాయ చేసే కర్ణాటకు చెందిన ఏడుగురు సభ్యుల ముఠాను చీరాల పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే కేసును ఛేదించారు. ఆదివారం ఈపురుపాలెం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఎండీ మొయిన్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... చీరాలలో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన ఏడుగురు ముఠాలోని ఒకరైన సాతుపాటి యువరాజు.. కర్ణాటక రాష్ట్రం దొడ్డపేటకు చెందిన స్వర్ణకారుడు నాగరాజును నమ్మించాడు. నాలుగు నెలల క్రితం ఫోన్‌ ద్వారా ఈ విషయం చెప్పాడు. చీరాలకు వస్తే తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని పేర్కొన్నాడు. నాగరాజుకు నమ్మకం కలిగించేందుకు ఒక బంగారు ఆభరణాన్ని చూపించాడు. ఈ క్రమంలో శనివారం నాగరాజును చీరాల ఆటోనగర్‌ దగ్గర గల బోయినవారి పాలెం రైల్వేట్రాక్‌ వద్దకు రమ్మని చెప్పడంతో రూ.14 లక్షల నగదుతో నాగరాజు, అతని సోదరుడు అక్కడకు వెళ్లారు. అక్కడ కలుసుకున్న నిందితుడు.. బంగారం తీసుకుని మా వాళ్లు అక్కడకు వస్తారని చెప్పి వెళ్లాడు. అనంతరం మరో ఆరుగురు వ్యక్తులు అక్కడకు వచ్చి డబ్బు చూపించాలని చెప్పడంతో వెంట తెచ్చిన నగదును బాధితులు వారికి చూపించారు. అనంతరం ముఠా సభ్యులు నాగరాజును, అతని సోదరుడిని కత్తితో గాయపరిచారు. వారి వద్ద ఉన్న నగదును, సెల్‌ఫోన్‌లను లాక్కొని కర్ణాటకకు చెందిన కారులో పరారయ్యారు. దీంతో బాధితుడు వెంటనే ఈపురుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ తుషార్‌ డూడీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మొయిన్‌ కేసు దర్యాప్తు ప్రారంభించారు. రూరల్‌ సీఐ శేషగిరిరావు, ఈపూరుపాలెం ఎస్సై చంద్రశేఖర్‌, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల వైపు వెళుతున్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుల కారును అడ్డగించారు. ప్రకాశం జిల్లా పోలీసుల సహకారంతో నిందితులను పెదదోర్నాల వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.14 లక్షల నగదుతోపాటు ఒక కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే కేసును ఛేదించిన చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్‌, రూరల్‌ సీఐ శేషగిరిరావు, ఎస్సై చంద్రశేఖర్‌, పోలీసు సిబ్బంది, ట్రైనీ ఎస్సై ఎన్‌.అలేఖ్య, హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.వెంకటరామరాజు, కానిస్టేబుళ్లు బాలచంద్ర, మోహనరావు, రమేష్‌, మహిళా కానిస్టేబుల్‌ అనిత, ఆదిలక్ష్మి, హోంగార్డు రవిరెడ్డిలను ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement