
పాలకుల తీరుతో రైతులకు ఇక్కట్లు
● వైఎస్సార్‌సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు
భట్టిప్రోలు: కూటమి అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదని, యూరియా కోసం ఎండలో గంటల తరబడి బారులు తీరాల్సిన దుస్థితి వచ్చిందని వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు పేర్కొన్నారు. భట్టిప్రోలు మార్కెట్ యార్డ్ ఆవరణలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) కార్యాలయం వద్ద క్యూ లైనులో యూరియా కోసం వేచి చూస్తున్న రైతులతో ఆదివారం ఆయన మాట్లాడారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ శాతం కౌలు రైతులే లైన్‌లో ఉన్నట్లు తేలింది. ఉన్నతాధికారులు సరిపడా యూరియాను రైతు సేవా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. తెల్లవారుజాము నుంచి నిలబడినా ఒక్క బస్తా కూడా దొరకలేదని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఇది కచ్చితంగా కూటమి ప్రభుత్వ వైఫల్యమని తెలిపారు. అరకొరగా యూరియా వచ్చినా అధికారులు వారికి కావాల్సిన వారికే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారని అన్నారు. ఎంత భూమి ఉన్నా ఒక్క బస్తా ఇవ్వడంతో ఏం చేయాలో రైతులకు అర్థం కాక కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. తగినన్ని ఎరువులను అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ నెల 9వ తేదీన ‘అన్నదాత పోరు’ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించి, రేపల్లె ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వనున్నట్లు అశోక్‌బాబు తెలిపారు.