
కమీషన్ల కోసమే ప్రైవేటుకు వైద్య కళాశాలలు
చెరుకుపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వైద్య కళాశాలలను కమీషన్ల కోసమే పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ ఆరోపించారు. ఆదివారం గుళ్లపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు వైద్యవిద్య అందించాలనే తపనతో నాటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఒకేసారి మంజూరు చేయించి, యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. జగనన్న పాలనలోనే ఏడు కళాశాలలకు ఎంసీఐ అనుమతులు అభించగా, మిగిలిన పదింటికి అనుమతులు రాకుండా అడ్డుకున్నారని, ఇది దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగించటం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులు రిజర్వేషన్ కోల్పోయి వైద్య విద్యకు దూరమై, తీవ్రంగా నష్టపోతారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క మెడికల్ కళాశాల కూడా మంజూరు చెయ్యలేదంటే ఆయనకు పేద విద్యార్థులపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమౌతుందని గణేష్ దుయ్యబట్టారు. నాడు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తాం అంటే సరస్వతీ దేవిని నడిరోడ్డుపై అమ్మకానికి పెడతారా అని టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నిలదీశారన్నారు. ఆయన ఆ మెడికల్ కళాశాలను ప్రభుత్వ పరం చేశారని డాక్టర్ గణేష్ గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు వైద్యవిద్యను ప్రభుత్వ పరం చేస్తే, దానికి పూర్తి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ప్రైవేటు పరం చేస్తూ ఎన్‌టీఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నాడని విమర్శించారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను మానుకోవాలని, లేనిపక్షంలో వైద్య విద్యార్థులతో కలసి వైఎస్సార్ సీపీ అధినేత ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని డాక్టర్ గణేష్ హెచ్చరించారు.
వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ
సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్