
ప్రజా సమస్యల పరిష్కారంపై బాధ్యత వహించాలి
బాపట్ల: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పాల్గొన్నారు. ప్రజా సమస్యల వినతి పత్రాలను కలెక్టర్ స్వయంగా స్వీకరించి, కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించి ప్రతి వినతిని నాణ్యతతో తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత చూపని అధికారులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించిన వాటికి ఆడిటింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఆడిటింగ్ చేయుటలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వార్తాపత్రికలలో ప్రచురితమైన ప్రతికూల వార్తలపై జిల్లా కలెక్టర్ స్పందించి ఆయా శాఖలకు సంబంధించిన అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఆయా వార్తలపై జిల్లా వివరణ ఇచ్చారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో భూములు, పొలాలు, ఇండ్ల స్థలాల రీ సర్వే జరుగుతుందని, స్వామిత్వ సర్వే కూడా జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందరూ ఈ సర్వేలో సహకరించి వారి ఆస్తులను కొలతలు వేయించుకొని ప్రాపర్టీ కార్డులు పొందాలని అన్నారు. ఎవరి ఆస్తులను వారే పరిరక్షించుకోవాలని ఆయన తెలిపారు.
ఆత్మహత్యల నివారణ దినోత్సవంపై
అవగాహన కల్పించాలి
ఈనెల 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువైనాయని, 15 నుంచి 30 సంవత్సరాలలోపు వారు ఎక్కువగా ఆత్మహత్యలకు గురవుతున్నారని, ఈ ఆత్మహత్యల నుంచి ప్రజలను కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి