
భర్త వేధింపుల నుంచి రక్షించండి !
విలేకరి ముసుగులో భర్త ఆగడాలు జిల్లా పోలీస్ కార్యాలయంలోని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు
గుంటూరు: వారసత్వంగా రానున్న పొలం కాగితాలు రాయించుకుని తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు విలేకరి (గుంటూరు జిల్లా ప్రత్తిపాడు)తో పాటు అత్త, మామల నుంచి రక్షణ కల్పించాలని ఓ మహిళ, తన కుమార్తెతో కలసి ప్రాథేయపడింది. నాలుగు రోజులుగా కనిపించకుండా బంధువుల ఇళ్లల్లో ఉంటున్నట్లు సోమవారం జిల్లా పోలీస్ కార్యాల య (డీపీఓ) ఆవరణలో జరిగిన ప్రజా ఫిర్యాదులు– పరిష్కార వేదికలో మొరపెట్టుకుంది. అనంతరం బాధితురాలైన కల్లూరి నాగేశ్వరి మీడియాతో మాట్లా డారు. 2009లో ప్రత్తిపాడుకి చెందిన కల్లూరి గురునాథంతో పెళ్లి అయ్యింది. ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయి ఇంటర్, రెండో కుమార్తె ఏడో తరగతి చదువుతోంది. భర్త, నేను పొలం పనులకు వెళ్తాం. భర్తకు మద్యం అలవాటు ఉంది. నాగేశ్వరి అమ్మమ్మ చెవినేని ఈశ్వరమ్మ నుంచి తల్లి ఆదిలక్ష్మి వాటా కింద రావాల్సి న 70 సెంట్ల పొలం ప్రత్తిపాడులో ఉంది. ప్రస్తుతం దాని ధర రూ.20 లక్షలు ఉంది. అమ్మమ్మ ఈశ్వరమ్మ వద్దకెళ్లి 70 సెంట్ల పొలం రాయించుకుని కాగితాలు తేవాలంటూ భర్త, బావ అయిన ఈనాడు ప్రత్తిపాడు విలేకరి సురేష్, అత్త,మామలు బెదిరిస్తున్నారు. అమ్మమ్మ నుంచి కాగితాలు తీసుకురాకపోతే చంపుతామంటూ చితకబాదడం, గదిలో నిర్బంధిస్తున్నారు. ఈనెల ఐదున నన్ను కొట్టి, తెల్ల కాగితాలు, రూ.50 స్టాంప్ కాగితాలపై సంతకాలు పెట్టించాలని ప్రయత్నించగా అందుకు నిరాకరించాను. గతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా, అతని పలుకబడితో కేసు నమోదు చేయలేదు. అదిగాక ఎమ్మెల్యే రామాంజనేయులు, రాజకీయ నాయకులు, పోలీసులు తెలుసంటూ బెదిరిస్తున్నారు.