
మానవత్వం చెత్తలో కలిసిన వేళ
వెలుగులోకి వచ్చిన బాపట్ల పురపాలక సంఘం దాష్టీకం అనాథ మృతదేహానికి దహన సంస్కారాలు జరిపేందుకు
బాపట్ల అర్బన్: ఎక్కడ పుట్టాడో తెలియదు ఎక్కడ పెరిగాడో తెలియదు. నా అన్న వాళ్లు ఎవరో తెలియదు. రైలు రూపంలో దూసుకొచ్చిన మృత్యువుకు బలయ్యాడు. రైలు పట్టాలపై మృత్యువాతపడిన అనాథ శవాల జాబితాలో తాను ఒక అంకెగా మారాడు. అలాంటి అనాథ మృతదేహానికి మానవత్వం అనే దహన సంస్కారం చేయాల్సిన మున్సిపల్ అధికారులు.. అమానవీయంగా వ్యవహరించారు. చాపలో చుట్టిన శరీరాన్ని చెత్తకుప్పగా మార్చాలని చూశారు. అనాథ మృతదేహానికి ఇదేనా అంతిమ సంస్కారం అని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. బాపట్ల రైల్వేస్టేషన్లో ఈనెల 3వ తేదీన అనాథ మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. ఎవరు రాకపోవడంతో స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇప్పటివరకు ఎదురుచూసినా మృతదేహానికి సంబంధించిన బంధువులు ఎవరు రాకపోవడంతో సోమవారం అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోస్టుమార్టం పూర్తయ్యాక ఏరియా ఆసుపత్రి వైద్యులు మున్సిపల్ సిబ్బందికి మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు స్థానిక మునిసిపల్ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలో ఎక్కించబోయారు. ఆ సమయంలో సాక్షి రిపోర్టర్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా వెంటనే అంబులెన్స్ పిలిపించారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నించగా మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించే బాధ్యత ప్రభుత్వాసుపత్రిదేనిని పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రి వారిని ప్రశ్నించగా తాము పోస్టుమార్టం చేయడం వరకేనని మునిసిపల్ సిబ్బంది శ్మశానవాటికకు తీసుకెళతారని తెలియజేశారు. అనాథ మృతదేహానికి అంతిమయాత్ర నిర్వహించాల్సిన అధికారులే ఒకరిపై ఒకరు చెప్పుకోవడం చెత్త ట్రాక్టర్లో తరలించేందుకు ప్రయత్నించడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెత్త ట్రాక్టర్లో తీసుకు వెళ్లేందుకు యత్నం

మానవత్వం చెత్తలో కలిసిన వేళ