
ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
చీరాల అర్బన్: ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చీరాల మండలం ఈపూరుపాలెం ఇందిరానగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇందిరానగర్‌కు చెందిన శ్రీకౌసల్య (23) రెండేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి వెనుక కాలువలోని చిల్లచెట్లకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి సోదరుడు పల్లా లోకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ తెలిపారు.
వృద్ధ మహిళను ఇంటి నుంచి గెంటేశారు
నగరంపాలెం: ఇంట్లోంచి బయటకు పంపించడంతో ఓ వృద్ధురాలు ఆరుబయట చీకట్లోనే ఉండిపోయింది. ఆర్టీసీ కాలనీ వెంకట్రావుపేట రెండో వీధిలోని ఓ ఇంట్లో 62 ఏళ్ల సంగీత సుధ ఉంటోంది. పైన ఆమెకు తెలిసిన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. సోమవారం రాత్రి ఆస్తి విషయంపై సుధతో వారు గొడవకు దిగారు. ఇంట్లోంచి బలవంతంగా ఆమెను బయటకు పంపేశారు. లోపలకు రాకుండా గేటుకు లోపల తాళాలు వేశారు. దీంతో చేసేది లేక సుధ ఇంటి ఎదుట ఓ కుర్చీలో కూర్చుండి పోయింది. ఇంటి ఆస్తికి సంబంధించి గొడవ కోర్టులో ఉందని, ఆస్తితో సంబంధం లేని వారు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయింది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయినట్లు తెలిపింది.
కొత్తరెడ్డిపాలెంలో
విష జ్వరాలు
చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో పది రోజుల్లో ఇద్దరు విష జ్వరాలతో మరణించటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రామాలయం సెంటర్ పరిధిలో కొద్ది రోజుల కిందట బడే రాము అనే వ్యక్తి విష జ్వరంతో గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ కిడ్నీ, ఇతర సమస్యలతో మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో గత నెలలో మరో వ్యక్తి జ్వరం బారిన పడి మృతి చెందటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీరిలో ఒకరికి గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మృతి చెందుతున్న వారి లక్షణాలు ఉన్నట్లు ప్రైవేటు వైద్యులు నివేదిక ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. కొత్తరెడ్డిపాలెం సమీప ప్రాంతాల్లో జ్వర పీడితులు సంఖ్య అధికంగా ఉండటంతో పీహెచ్‌సీ వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. మంగళవారం గ్రామంలో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక బృందాల ద్వారా సేవలు అందించనున్నట్లు చెప్పారు.

ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య