
చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన
లక్ష్మీపురం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట భగత్ సింగ్ బొమ్మ వద్ద చెవిలో పూలు పెట్టుకుని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ జీ మాట్లాడుతూ పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నడపడం వల్ల మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్‌కు దూరమవుతారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 14 మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారని, వాటిలోరాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం జిల్లాల్లో గత విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. నేడు కూటమి ప్రభుత్వంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రలో భాగంగా ప్రతి మెడికల్ కళాశాలను 100శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానాన్ని తీసుకువచ్చి ఈరోజు కళాశాలలను కార్పొరేట్లకు అప్పజెబుతున్నారని ఆరోపించారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ ఈ విధానం వల్ల పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ విద్య కలగానే మిగిలిపోతుందని తెలిపారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు చేసి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో మోసాన్ని విద్యార్థుల్లోకి తీసుకువెళ్లి పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు . కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండు శివ, బందారపు యశ్వంత్, నగర కార్యదర్శి ప్రణీత్, నాయకులు అజయ్, దుర్గా ప్రసాద్, సాయి గణేష్, పవన్, వెంకీ పాల్గొన్నారు.