
కృష్ణా నదిలో దూకి యువకుడు గల్లంతు
కొల్లూరు: కృష్ణా నదిలో దూకి ఓ యువకుడు గల్లంతైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని చింతర్లంకకు చెందిన తోడేటి హర్షవర్ధన్(22) తోటి మిత్రులతో కలసి రాత్రి సమయంలో మండలంలోని పెసర్లంక –పెదలంక అరవింద వారధి పైకి వచ్చాడు. కొంత సమయం గడిచిన అనంతరం ఓ మిత్రుడు ద్విచక్ర వాహనంపై కొల్లూరు వెళ్లాడు. అదే సమయంలో హర్షవర్ధన్ నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన అతని వెంట ఉన్న మరో స్నేహితుడు నదిలో దూకబోతున్న హర్షవర్ధన్‌ను నిలువరించేందుకు ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుంటున్న స్నేహితుడి నుంచి విడిపించుకున్న యువకుడు వారధి రైయిలింగ్ పైకి ఎక్కి నదిలో దూకేశాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి రాత్రి సమయంలో టార్చ్ లైట్లతో వెదికినప్పటికీ యువకుడి ఆచూకీ లభించలేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి గాజుల్లంకకు చెందిన మత్స్యకారులు నదిలో గాలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. నదిలో నీటిమట్టం పెరగడంతోపాటు, యువకుడు దూకిన ప్రదేశంలో సుడి గుండాలు ఉండడంతో గాలింపు ప్రయత్నాలను విరమించుకున్నారు. యువకుడు ఆత్మహత్యాయత్నం సమాచారం అందుకున్న తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, కొల్లూరు పోలీసులు ఎస్‌డీఆర్‌ఎప్ బృందం కోసం ఉన్నతాధికారులకు నివేదించినప్పటికీ ఉన్నతాధికారుల అనుమతులలో జాప్యం కారణంగా సోమవారం రాత్రి వరకు వారు అందుబాటులోకి రాలేదు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లైప్ బోట్ సాయంతో యువకుడి ఆచూకీ కోసం వారధి పరిసర ప్రాంతాలలో గాలింపు చర్యలు జరిపినా ఎటువంటి ప్రయోజనం లభించలేదు. యువకుడు ఆత్మహత్యాయత్నంపై గ్రామంలో భిన్న కథనాలు వెలువడుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. దర్యాప్తులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి కారణాలు వెలువడనున్నట్లు పోలీసులు వెల్లడించారు. యువకుడు గల్లంతుపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని కొల్లూరు పోలీసులు తెలిపారు.

కృష్ణా నదిలో దూకి యువకుడు గల్లంతు