
వీవీఐటీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన జర్మనీ బృందం
పెదకాకాని: జర్మనీలోని అతి పెద్ద నైపుణ్య శిక్షణ సంస్థ డెక్రా అకాడమీ ప్రతినిధులు మండలంలోని నంబూరు వీవీఐటీ విశ్వవిద్యాలయంలోని సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. రాష్ట్ర యువతలో నైపుణ్య కార్యక్రమాలను మెరుగుపరచడానికి, ప్రపంచ ఉపాధి అవకాశాలను సులభతరం చేసేందుకు గాను నియమితులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు (అంతర్జాతీయ నైపుణ్య, ఉద్యోగ కల్పన) సీతాశర్మతో కలసి శుక్రవారం యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులకు అందించే శిక్షణ గురించి సీమన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ రావెల నవీన్ బృందానికి వివరించారు. సీతాశర్మ మాట్లాడుతూ జర్మనీ ప్రస్తుతం నైపుణ్యం గల నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. నిర్మాణం, ఇంజినీరింగ్, సమాచార సాంకేతిక వంటి రంగాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలున్నాయని చెప్పారు. ఇండో జర్మన్ సమష్టి కృషితో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు శిక్షణను అందించడం ద్వారా అంతర్జాతీయ నియామకాలు అందించవచ్చని సూచించారు.