రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇరువురు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇరువురు ఎంపిక

Sep 5 2025 5:14 AM | Updated on Sep 5 2025 5:14 AM

రాష్ట

రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇరువురు ఎంపిక

బాపట్ల: బాపట్ల వ్యవసాయ కళాశాలలో జెనెటిక్స్‌, ప్లాంట్‌ బ్రీడింగ్‌ విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్‌ లాల్‌ అహమ్మ ద్‌ మహమ్మద్‌కు రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడి అవార్డుకు ఎంపికయ్యారు. బోధన, పరిశోధన, పరిపాలన విభాగాలలో 19 సంవత్సరాలుగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ లాల్‌ అహమ్మద్‌ మహమ్మద్‌ ఇప్పటివరకు 19 మంది ఎంఎస్సీ, నలుగురు పీహెచ్‌డీ పరిశోధకులకు అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా సహకరించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాలో వృత్తి శిక్షణను పొందడమే కాకుండా అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలలో స్టడీ విజిట్‌ చేసిన ఘనతను పొందారు. స్టూడెంట్‌ యాక్టివిటీస్‌ ఇన్‌చార్జిగా, అకడమిక్‌ మ్యాటర్స్‌ ఇన్‌చార్జిగా అదనపు వార్డెన్‌గా, ఎన్‌.ఎస్‌.ఎస్‌.ప్రోగ్రాం ఆఫీసర్‌గా, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌గాను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కోచింగ్‌ సెల్‌ ఇన్‌చార్జిగా పలు కీలకమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. అనేక జాతీయ సెమినార్లు, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పలు వ్యవసాయ పత్రికలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించడమే కాక 200 పరిశోధన పత్రాలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు సమర్పించారు. డాక్టర్‌ లాల్‌ అహ్మద్‌కు పుర స్కారం లభించడం పట్ల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి ప్రసూనరాణి, బోధన, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

క్రాప్‌ ఫిజియాలజీ విభాగాధిపతి జయలలిత

బాపట్ల వ్యవసాయ కళాశాలలో క్రాప్‌ ఫిజియాలజీ డిపార్టుమెంట్‌ ప్రొఫెసర్‌, విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ కే.జయలలితను రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు వరించింది. రెండు దశాబ్దాలపాటు బోధనలోనూ, ఆరున్నర సంవత్సరాలుగా పరిశోధనలోను అత్యుత్తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె జేఆర్‌ఎఫ్‌ఎస్‌ఆర్‌ఎఫ్‌ –ఐసీఏఆర్‌ శిక్షణ తరగతులను నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు. జాతీయ సెమినార్లు, వర్క్‌షాపులు, సదస్సులు అనేకం నిర్వహించారు. పదిమంది ఎంఎస్‌సీ, ఆరుగురు పీహెచ్‌డీ స్కాలర్లకు గైడ్‌గా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 100 పరిశోధన పత్రాలను వివిధ పత్రికలకు సమర్పించారు. బాలికల హాస్టల్‌కు వార్డెన్‌గాను, అకడమిక్‌ విభాగానికి ఇన్‌చార్జిగాను వ్యవహరించారు. సాంకేతిక సదస్సులు, ఎగ్జిబిషన్ల నిర్వహణలో పాలుపంచుకున్నారు.

రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇరువురు ఎంపిక1
1/1

రాష్ట్ర స్థాయి అవార్డులకు ఇరువురు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement