
క్షయ వ్యాధి కేసులను వేగంగా గుర్తించాలి
చీరాల రూరల్ : క్షయ వ్యాధి బారినపడిన బాధితుల వివరాలను గుర్తించి గూగుల్ ఫాంలో పొందుపరచాలని క్షయవ్యాధి నివారణ జిల్లా కోఆర్డినేటర్ కార్తీక్‌కుమార్ అన్నారు. ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ) హాలులో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎం, నిక్షయ్‌మిత్ర, ఆశలకు క్షయవ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక్‌కుమార్ మాట్లాడారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నా, రాత్రి సమయంలో చెమటలు పడుతున్నా.. దగ్గితే నోట్లో నుంచి రక్తం పడినా, ఛాతీలో నొప్పిగా ఉన్నా, సక్రమంగా శ్వాస ఆడకపోయినా, బరువు కోల్పోతున్నా, ఆకలిగా లేకపోయినా, అలసటగా ఉన్నా, మెడలో వాపుగా ఉన్నా క్షయవ్యాధి లక్షణాలుగా గుర్తించాలని సూచించారు. ఆయా లక్షణాలు కలిగినవారు ప్రభుత్వ వైద్యశాలలో టీటీ యూనిట్‌లలో ఉచితంగా అందించే మందులను వాడుకో వాలని సూచించారు. హెచ్‌ఐవీ వ్యాధిగ్రమస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, ధూమపానం, మద్యపానం, పోషకాహార లోపాలున్నవారు, 60 ఏళ్లకు పైబడినవారు కూడా క్షయవ్యాధి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ యూనిట్ సిబ్బంది టి.నరేంద్రబాబు, పీఎస్.వర్షదార, కె.శ్రీలక్ష్మి, రియాజ్, నీలిమ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
క్షయవ్యాధి నివారణ జిల్లా
కోఆర్డినేటర్ కార్తీక్‌కుమార్