
ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గండి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి మజుంధర్ బాపట్లలో నిరసన ప్రదర్శన
బాపట్ల అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోలు, వ్యాన్లు, జీపు డ్రైవర్ల ఉపాధికి గండి పడిందని సీఐటీయూ బాపట్ల జిల్లా కార్యదర్శి సీహెచ్ మజుంధర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుతో ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని డిమాండ్ చేస్తూ బాపట్ల పాత బస్టాండ్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు మంగళవారం డ్రైవర్లు ప్రదర్శన నిర్వహించారు. బాపట్ల జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. మజుంధర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంధనం, నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. దీని తోడు పెంచిన జరిమానాలు ఆటో డ్రైవర్లకు కునుకులేకుండా చేస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయారని అని అన్నారు. వాహనమిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకురూ.25,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆటో కార్మికుల రాష్ట్రవ్యాప్తంగా ఐక్యం చేస్తూ ఉద్యమించాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల పట్టణ నాయకులు కే శరత్, బాపట్ల పాత బస్టాండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామకృష్ణ, శ్రీనివాసరావు, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.