
కృష్ణా నదిలో పెరిగిన వరద ప్రవాహం
లోలెవల్ వంతెనపైగా నీటి ప్రవాహం స్తంభించిన రాకపోకలు
కొల్లూరు: కృష్ణా నదికి వరద నీటి విడుదల కొనసాగుతుండటంతో మంగళవారం ప్రవాహ ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి మంగళవారం 3.38 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. పెసర్లంక అరవింద వారధి, గాజుల్లంక చినరేవుల నుంచి వరద నీరు లోతట్టు ప్రాంతాలోకి చేరుతుంది. వరద నీరు గణనీయంగా పెరగడంతో మండలంలోని దోనేపూడి –పోతార్లంక మార్గంలో దోనేపూడి కరకట్ట దిగువన చినరేవుపై ఉన్న లోలెవల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా మండలంలోని పోతార్లంక, తోకలవారిపాలెం, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం పంచాయతీల పరిధిలోని ప్రజలు భట్టిప్రోలు మండలం వెల్లటూరు, కొల్లూరు మండలం గాజుల్లంక గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. గత నెల రోజుల పైబడి నదిలో నిండుగా వరద నీరు ప్రవహిస్తుండటంతోపాటు లోతట్టు ప్రాంతాలలోని పంటలు ముంపునకు గురవుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వరద తీవ్రత తగ్గుముఖం పడితే పంటలు దక్కుతాయన్న ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతుంది.