
పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకం
పర్చూరు(చినగంజాం): పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర పాఠశాలల పరిశీలన బృందం సభ్యుడు, డైట్ లెక్చరర్ పీ రమేష్ అన్నారు. పర్చూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పాఠశాలల్లో విద్యాభివృద్ధి పరిశీలనలో భాగంగా ఆయన సోమవారం సందర్శించారు. పాఠశాలలో వివిధ తరగతులు అభివృద్ధి, పాఠశాలలోని రికార్డుల నిర్వాహణ, అకడమిక్ అంశాలు, పిల్లల హాజరు, వారిలో విద్యాభివృద్ధి, పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనం అమలు, అందుకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించారు. ముందుగా ఆయన పాఠశాల ప్రార్థనా సమయానికి వచ్చి పిల్లలు యూనిఫాం నిర్వహణ, క్రమశిక్షణ అమలు తీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆయన స్వయంగా భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. 1వ తరగతి నుంచి మొదలుకొని అన్ని తరగతులను పరిశీలించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులకు వివిధ సూచనలు చేశారు. భవిష్యత్‌లో పాఠశాలను సందర్శిస్తామని విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను మెరుగు పరచుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ–1 ఏ.శివ కోటేశ్వరరావు, ఎంఈఓ–2 పీ.వెంకటరామయ్య, పాఠశాల హెచ్‌ఎం ఎం. నాగిరెడ్డి, పీ. నాగమణి, సీఆర్‌ఎంటీలు ఏ. ఉమావెంకట మహేశ్వరరావు, సాయికుమార్ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పాఠశాలల పరిశీలన బృందం సభ్యుడు రమేష్