
క్వారీలో ప్రమాదంపై మైన్స్ అధికారుల తనిఖీ
బల్లికురవ: గ్రానైట్ క్వారీలో రాయి తీస్తుండగా ఆదివారం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంఽధించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మైన్స్ అండ్ సెప్టీ అధికారులు సోమవారం క్వారీలో తనిఖీ చేపట్టారు. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో రాయిపడి ఆరుగురు కార్మికులు మృతిచెందినట్లు, మొత్తం 16 మంది పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళికి అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై పుర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మైనింగ్ శాఖకు కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు డీఎంస్ అశోక్ కుమార్, డీడీ ఎం జ్ఞానేశ్వర్, ఏడీ రామచంద్ర, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ రవినాయక్, ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన సహాయ కమిషనర్ బృందం ప్రమాదం సంభవించిన క్వారీ ప్రాంతాన్ని పరిశీలించింది. ఆదివారం ఉదయం నుంచి క్వారీ నిర్వాహకులు కార్యాలయాలకు తాళాలు వేశారు.
అధికారుల రాకతో అప్పటికప్పుడు క్వారీ, పరిసర క్వారీల నిర్వాహకులతో ప్రత్యక్షమయ్యారు. అప్పటికి అప్పుడు హెల్మెట్లు తెప్పించుకుని తలలకు ధరించారు. కార్మికులు చనిపోయిన ప్రదేశంలో ఒక్క హెల్మెట్ గాని, షూ కాని కనిపించక పొవటంతో భద్రతా చర్యలు పాటించకపోవటం వల్లే ఘోర ప్రమాదానికి కారణంగా భావించారు. అనంతరం నరసరావుపేటలోని జీబీఆర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న కార్మికులు ఎం సుదర్శన్ కె.నాయక్, శివా గౌడలను పరామర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పూర్తి నివేదికను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.