
ఆర్మీ జవాన్ మృతి
నగరం: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఉప్పాల రవికుమార్ (24) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. చిరకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల ఇమ్మానుయేలు, లక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు రవికుమార్ నాలుగేళ్ల కిందట ఆర్మీలో జవాన్‌గా చేరాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ ఇటీవల వివాహం నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల కుమార్తెతో నిశ్చితార్ధం చేసుకుని వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆపరేషన్ సిందూర్ విధుల్లోకి హాజరుకావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు రావటంతో విధుల్లోకి వెళ్లాడు. త్వరలోనే వివాహ ముహుర్తాన్ని ఖరారు చేసుకుని స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకోవాల్సిన కుమారుడు రవికుమార్ గత శనివారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి అక్కడిక్కడే మృతి చెందాడు. రవికుమార్ భౌతికకాయం మంగళవారం స్వగ్రామమైన చిరకాలవారిపాలెం గ్రామానికి రానుంది. రవికుమార్ అకాల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.