
పిచ్చి కుక్క స్వైరవిహారం
ఏడుగురికి తీవ్రగాయలు
మార్టూరు: ఈ మధ్య పిచ్చికుక్కలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలోని కోలలపూడి గ్రామంలో ఓ పిచ్చికుక్క సోమవారం ఉదయం స్వైర విహారం చేసింది. స్థానిక ఎస్సీ కాలనీలో కనిపించిన వారందరినీ కరుస్తూ మొత్తం ఏడుగురు వ్యక్తులను గాయపరిచింది. గాలి ఏసుకు తల, మొహంపై తీవ్ర గాయాలు కాగా గద్దల సత్యం, దాసరి సుబ్బులు, మురికిపూడి మహేష్, మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. బాధితులను మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వ్యాక్సిన్ వేసి చికిత్స అందించారు. తాతా వెంకటరత్నం అనే మహిళ తన ఇంటి ముందు మంచం పై పడుకొని ఉండగా పిచ్చికుక్క ఆమె చెంపలపై నుదుటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందని తెలిపినట్లు బంధువులు తెలిపారు.
రెడ్‌బుక్‌ను కూటమి నేతలు తగులబెట్టాలి
నరసరావుపేట: రాష్ట్రంలో 13 నెలలుగా కొనసాగుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగపు రౌడీయిజానికి 1161 మంది గురై వారి భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో, ఎట్టకేలకు హైకోర్టు స్పందించి రిమాండ్ విధించే ముందు మేజిస్ట్రేట్లు నిబంధనలను గట్టిగా పాటించాలని ఆదేశించడం హర్షణీయమని సోషల్ యాక్టివిస్టు ఈదరగోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అరాచక పాలన చేసిన కూటమి నేతలు, పోలీసులకు ఈ ఆదేశాలు చెంపపెట్టు లాంటివని అన్నారు. ఈ ముఖ్యమైన అంశంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ హరీశ్వరరెడ్డి చొరవ తీసుకుని హైకోర్టులో పిటిషన్ వేయడం అభినందనీయమని అన్నారు. ఇంతటితో ఆగకుండా ఇప్పటికే పెట్టిన 1161 కేసులను సమీక్షించి నిర్దోషులను కేసుల నుంచి తప్పించేందుకు పోలీసు వేధింపులు, హింసకు గురైన వారికి ఊరట కల్పించి, నష్టపరిహారం ఇప్పించేందుకు, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిట్టింగ్ జడ్జితో ఒక ప్రత్యేక విచారణ కమిటీని హైకోర్టు నియమించేలా పోరాటం కొనసాగించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ఇకనైనా బుద్ధి తెచ్చు కుని, పశ్చాత్తాపం చెంది రెడ్‌బుక్‌ని నడిరోడ్డులో తగల పెట్టాలని డిమాండ్ చేశారు.
మంచి యూనిట్లు ఎంపిక చేసుకొనిఆదాయం పెంచుకోండి
నరసరావుపేట: ప్రతిఒక్కరూ మంచి యూనిట్లను ఎంపిక చేసుకొని వాటి ద్వారా కుటుంబానికి ఆదాయం పెంచుకునేలా కృషిచేయాలని అధికారులు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పీఎంఇజీపి, పీఎంఎఫ్‌ఎంఎఫ్ రుణాలపై బ్యాంకర్లచే లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని డీఆర్‌డీఎం పీడీ ఝాన్సీరాణి మాట్లాడారు. లబ్ధిదారులకు కావలసిన శిక్షణ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, మార్కెటింగ్ చేసేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ప్లిఫ్‌కార్ట్ వంటి వాటి ద్వారా వీలు కల్పించడం జరుగుతుందని అన్నారు. హార్టీకల్చర్ జిల్లా అధికారి ఐ.వెంకటరావు మాట్లాడుతూ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేసుకొని తర్వాత కొటేషన్, ఆధార్, పాన్‌కార్డు సిద్ధం చేసి సంబంధిత అధికారికి అందజేసిన తర్వాత లాగిన్‌లో అప్‌డేట్‌చేసి వాటిని అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీతో కూడిన యూనిట్లను ఎంచుకొని వాటిపై లబ్ధిదారులు లబ్ధిపొందేలా చేయడమే కలెక్టర్ అరుణ్‌బాబు ఆలోచన అన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్, డీపీఎం డేవిడ్, శ్రీనివాస్, యూనియన్ బ్యాంకు, సీజీజీబి అధికారులు పాల్గొన్నారు.

పిచ్చి కుక్క స్వైరవిహారం