
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0ను పండుగ వాతావరణంలో న
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశం పండుగ వాతావరణంలో వేడుకగా జరపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహణపై సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశాన్ని జయప్రదంగా నిర్వహించడానికి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు ముందుగా సమాచారం పంపాలన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు గౌరవప్రదంగా వారిని ఆహ్వానించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,818 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 1,59,108 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. విద్యార్థి మిత్ర బహుమానాలను అందుకున్న విద్యార్థులంతా నూతన దుస్తులు ధరించి పాఠశాలకు హాజరు కావాలన్నారు. జూనియర్ కళాశాలలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉంచామని, మంగళవారం నాటికి నర్సరీల నుండి ఆయా మండలాలకు చేరుతాయన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో విద్యార్థుల ప్రగతి నివేదిక, హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. షైనింగ్ స్టార్ అవార్డులు పొందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులను పిలిపించి వేదికపై మాట్లాడించాలన్నారు. ముందస్తుగా విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈఓ పురుషోత్తం, ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీపీఓ ప్రభాకరరావు, అటవీశాఖ అధికారి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.