గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు

Jul 10 2025 6:43 AM | Updated on Jul 10 2025 7:03 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: సామాజిక సేవా విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు గవర్నర్‌ పురస్కారాలు లభించాయి. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రెడ్‌క్రాస్‌ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో భాగంగా రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా రెడ్‌క్రాస్‌ గుంటూరు జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ వడ్లమాని రవి, వైస్‌ చైర్మన్‌ పి.రామచంద్రరాజు అవార్డులను అందుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి తృతీయ ఉత్తమ జిల్లాగా గుంటూరు రెడ్‌క్రాస్‌కు అవార్డులు వరించాయి.

వైకుంఠపుర వాసుని ఆదాయం రూ.46.76 లక్షలు

తెనాలిరూరల్‌: స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్‌ టి.సుభద్ర, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. 113 రోజుల అనంతరం లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా లెక్కింపు సేవలో పాల్గొన్నారు. దేవస్థానంలోని హుండీ లెక్కింపు ద్వారా రూ.46,76,204 నగదు స్వామి వారికి సమకూరింది. అలానే 19.50 గ్రాముల బంగారం, 319 గ్రాముల వెండిని భక్తులు స్వామి వారికి సమర్పించారు. అలానే రద్దయిన పాత రూ. వెయ్యి నోట్లు ఆరు, రూ. 500 నోట్లు పది గుర్తు తెలియని భక్తులు హుండీలో వేశారు. లెక్కింపులో భక్తులు, వలంటీర్లు, చెంచుపేట ఆప్కాబ్‌ బ్యాంక్‌ సిబ్బంది, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ పాల్గొన్నారు.

సమన్వయంతో సైబర్‌ నేరాలకు చెక్‌

నగరంపాలెం: పోలీస్‌ శాఖ, బ్యాంక్‌లు సమన్వయంతో సైబర్‌ నేరాలను అరికడదామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో బుధవారం జిల్లాలోని బ్యాంక్‌ల మేనేజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న దృష్ట్యా సైబర్‌ మోసాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజలు, ఖాతాదారులకు ముందస్తు సమాచారం, అవగాహన కల్పిద్దామన్నారు. వినియోగదారులు పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే బాధితులకు ఎఫ్‌ఐఆర్‌ లేకుండా సహాయమందుతుందని చెప్పారు. ఖాతాదారులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి నగదు లావాదేవీలు నిర్వర్తించే వేళల్లో బ్యాంక్‌లను సంప్రదించి నిజనిజాలను పరిశీలించాలని పేర్కొన్నారు. డిజిటల్‌ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, లోన్‌ యాప్‌ మోసాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఖాతాదారులకు, ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే బ్రోచర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), యూనియన్‌ బ్యాంక్‌ డీజీఎం జవహర్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ మహిపాల్‌రెడ్డి, బ్యాంక్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు 1
1/3

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు 2
2/3

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు 3
3/3

గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్‌కు పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement