
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ
బాపట్లటౌన్: వెదుళ్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్టూవర్టుపురం రైల్వేస్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఒక మహిళ తన ఇద్దరి కుమార్తెలతో ఆదివారం ఉదయం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయం తెలుసుకున్న వెదుళ్లపల్లి ఎస్‌ఐ భాగ్యరాజు సమయస్ఫూర్తిగా వ్యవహరించి తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వారి ప్రాణాలను కాపాడారు. ఆదివారం ఉదయం తల్లి, ఇద్దరు కుమార్తెలతో కలిసి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వెదుళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌కు కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్‌ఐ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్టూవర్టుపురం రైల్వేస్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నించిన మహిళ, ఆమె కుమార్తెలను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆత్మహత్యకు యత్నించడానికి దారితీసిన కారణాల గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ వివాదాలే కారణమని తెలుసుకొని, వారి నివాసానికి వెళ్లి ఇరువురికి కుటుంబ విభేదాలపై కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సమస్యలను పరస్పర చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించడంతో ముగ్గురు ప్రాణాలు నిలిచాయన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ తుషార్‌డూడీ వెదుళ్లపల్లి ఎస్‌ఐని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయన్నారు. వాటిని సానుకూలంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కృషి చేయాలన్నారు. అంతేగాని ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. అప్పటికి సమస్యలు పరిష్కారం కాకుంటే పోలీసులను ఆశ్రయించాలన్నారు.
ఇద్దరు కుమార్తెలతో
రైల్వేట్రాక్‌పైకి వెళ్లిన తల్లి
తక్షణమే స్పందించి వారి
ప్రాణాలు కాపాడిన వెదుళ్లపల్లి ఎస్‌ఐ
ఎస్‌ఐని అభినందించిన
ఎస్పీ తుషార్‌డూడీ