
మూడు గ్రానైట్ లారీలు స్వాధీనం
దాచేపల్లి:అక్రమ గ్రానైట్ రవాణా వ్యవహారం విచ్చలవిడిగా జరుగుతూనే ఉంది. రాయల్టీ బిల్లులు చెల్లించకుండా గ్రానైట్ రాయిని తరలిస్తున్న మూడు లారీలను వాణిజ్య పనుల శాఖ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. పట్టుకున్న లారీలను నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్నారు. దాచేపల్లి మండలం పరిధిలోని రాష్ట్ర సరిహద్దును దాటించేందుకు గ్రానైట్ లారీలను పచ్చ ముఠా నేతలు దాచేపల్లికి తీసుకువచ్చారు. గ్రానైట్ రాయిని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం జిల్లా జాయింట్ కలెక్టర్‌కి అందింది. జేసీ ఆదేశాల మేరకు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాచేపల్లిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గ్రానైట్ రాయి లోడ్‌తో ఉన్న మూడు లారీలను డొంక రోడ్డులో ముళ్లపొదల్లో ఉంచినట్లుగా గుర్తించారు. నడికుడి రైల్వేస్టేషన్ రోడ్‌లో రెండు గ్రానైట్ లారీలను, గోగులపాడు రోడ్‌లో ముళ్లపొదల్లో ఉన్న మరో గ్రానైట్ లారీని స్వాధీనం చేసుకున్నారు. గ్రానైట్ లారీలకు సంబంధించి ఎటువంటి రాయల్టీ బిల్లులు లేన్నట్లు గుర్తించారు.