
నేటి నుంచి టౌన్‌చర్చి శతవార్షికోత్సవాలు
ఆహ్వానపత్రికను ఆవిష్కరిస్తున్న ప్యారిష్ పాస్టర్ రెవ.దేవరపల్లి ఏసురత్నం
తెనాలి: పట్టణంలో టౌన్‌చార్చిగా పిలుచుకునే ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చి(తూర్పు గుంటూరు సినడ్) క్రీస్తు దేవాలయం శతవార్షిక మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ఆరంభం కానున్నాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, బ్రోచర్‌ను బుధవారం టౌన్‌చర్చిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి ఏసురత్నం, అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ వై.లెనిన్‌బాబు, రెవరెండ్ డి.సాల్మన్‌రాజు, రెవరెండ్ ఎంవీబీ ప్రకాష్‌బాబు అడ్‌హాక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. 10,11,12 తేదీల్లో ఉదయం ప్రార్థన, ఆరాధనలు, సాయంత్రం చర్చి వెలుపల వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏఈఎల్ చర్చి కంట్రోలర్ జస్టిస్ కురియన్ జోసెఫ్, కేరళకు చెందిన మాజీ జడ్జి జోసెఫ్ పీఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఎన్.జేసురత్నకుమార్ హాజరవుతారని తెలిపారు.
● రెవ.వై.లెనిన్‌బాబు మాట్లాడుతూ హాఫ్‌దొర టౌన్‌చర్చిని కట్టించి విద్యాలయం, వైద్యశాలను నిర్మించి ప్రజలకు సేవలందించినట్టు తెలిపారు. మూడురోజుల ఉత్సవాలకు ప్రజలు హాజరై దేవుని మన్ననలు పొందాలని అడిషనల్ పాస్టర్లు రెవ.డి.సాల్మన్‌రాజు, రెవ.ఎంవీబీ ప్రకాష్‌బాబు కోరారు. శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సెయింట్‌జాన్స్ విద్యాసంస్థ పక్కన ఉన్న లూథరన్ యూపీ స్కూలు ప్రాంగణంలో ప్రేమ విందు ఉంటుందని అడ్‌హాక్ కమిటీ సభ్యుడు జి.వేమయ్య చెప్పారు.