
అడవి తల్లిపై గొడ్డలి వేటు
బాపట్లటౌన్: పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతగానో దోహదపడతాయని, వాటిని పరిరక్షించాలంటూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చే నాయకులు, అధికారులు పెంచిన తోటలను కాపాడటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన అటవీ శాఖాధికారులు చుట్టం చూపుగా వచ్చి పోతుండటంతో దొంగల చేతికి తాళం ఇచ్చిన చందంగా మారింది. పగలు.. రాత్రి తేడా లేకుండా దుండగులు యథేచ్ఛగా అడవుల్లోని జామాయిల్, జీడిమామిడి చెట్లను నరికి ఇళ్లకు, మార్కెట్‌కు తరలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తంతు జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్నారిలా..
మండలంలోని కప్పలవారిపాలెం, ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్, సూర్యలంక, కర్లపాలెం మండలంలోని పేరలి, తుమ్మలపల్లి, గణపవరం, నర్రావారిపాలెం, మేకలవారిపాలెం తదితర గ్రామాలకు అందుబాటులో ఫారెస్ట్ భూమి ఉంది. అయితే ఆయా గ్రామాల ప్రజలతో వేరే ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకొని రాత్రికి రాత్రే అడవికి వెళ్లి తోటలను నరకటం, వాటిని పడవల సాయంతో కాలువలు దాటించడం.. కాలువ దాటిని కలపను ట్రాక్టర్లు, ఆటోలలో వేరే ప్రాంతానికి తరలించడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా మరికొందరు ఉదయం సమయంలో తోటకు వెళ్లి వాళ్లకు నచ్చిన చెట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని రాత్రి సమయంలో నరకడం జరుగుతుంది. నరికిన సరుకును రాత్రికి రాత్రే అవసరమైన వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు పట్టణంలోని వివిధ అడితీల్లో కలపను ఇక్కడే కొనుగోలు చేసినట్లుగా ఫోర్జరీ బిల్లులు సృష్టించి తనిఖీల కోసం వచ్చిన అధికారులకు చూపించడం ఇక్కడి ప్రజలకు షరా మామూలైంది.
పెట్టుబడి ప్రభుత్వానిది.. సొమ్ము స్మగ్లర్లకు..
అటవీ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి జామాయిల్, సరుగుడు, జీడిమామిడి తోటలు వేశారు. అయితే అవి పెరిగిన తర్వాత తోటలకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే కట్‌చేసి టన్నుల ప్రకారం కలపను విక్రయించాల్సి ఉంటుంది. అయితే తోటలు పెరిగిన తర్వాత కట్ చేయకపోవడం, పలు రకాల తెగుళ్లు సోకి ఎండిపోతున్న చెట్లును అక్కడే వదిలివేయటంతో స్మగర్లు ఎండిన చెట్లను వంట చెరకుగా, పచ్చిచెట్ల బాదులను శ్లాబులకు ఉపయోగించే బాదులుగా, పేపర్ మిల్లులకు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బీట్‌లో మొక్కలు నాటేముందు కనీసం 10 వేల మొక్కలకు తగ్గకుండా నాటుతున్నారు. అవి పెరిగిన తర్వాత కనీసం రెండు వేల మొక్కలు కూడా ఉండటం లేదు. ఇంతజరుగుతున్నా ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి స్మగ్లర్ల బారినుంచి తోటలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతరిస్తున్న అటవీ విస్తీర్ణం రాత్రికి రాత్రే యథేచ్ఛగా తరలిపోతున్న కలప పచ్చని తోటలకు సైతం నిప్పంటిస్తున్న వైనం చోద్యం చూస్తున్న అధికారులు
అడవులు నరికినా అడిగేదెవరు?
బాపట్ల మండలం ముత్తాయపాలెం, కర్లపాలెం మండలం పేరలి ప్రాంతాల్లో అటవీ భూమి వేల ఎకరాల్లో ఉంది. వీటిల్లో ముత్తాయపాలెం సెక్షన్ పరిధిలో ఏ, బీ బీట్‌లు, పేరలి సెక్షన్ పరిధిలో ఏ, బీ బీట్‌లు ఉన్నాయి. వీటిల్లో జామాయిల్, జీడిమామిడి తోటలు సుమారు 25 వేల హెక్టార్ల మేర ఉంటాయి. అయితే తోటలు పెరిగిన తర్వాత వాటిని కొట్టించి వచ్చిన కలపను విక్రయించి ఆ సొమ్ముతో మిగిలిన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే అధికారులు స్థానికంగా ఉండకపోవడం, తోటలకు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోతుండటంతో రాత్రికి రాత్రే సుమారు వందల సంఖ్యలో జామాయిల్ బాదులు మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి.

అడవి తల్లిపై గొడ్డలి వేటు

అడవి తల్లిపై గొడ్డలి వేటు