
భవనాశికి గ్రహణం
భవనాశి మినీ రిజర్వాయర్‌కు గ్రహణం పట్టింది. ఎన్నికలకు ముందు అద్దంకిలో పర్యటించిన ప్రస్తుత మంత్రి నారా లోకేష్, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌లు అధికారంలోకి వస్తే పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు.
అద్దంకి: కూటమి ప్రభుత్వం తీరుతో 5 వేల ఎకరాల మెట్ట రైతులు సాగునీటి ఆశలు ఆవిరౌతున్నాయి. దానికి తోడు బడ్జెట్‌లో రిజర్వాయరు కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించకపోవడంతో ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం లేదనేది తేటతెల్లం అయింది. బాపట్ల జిల్లాలోని శింగరకొండలో బ్రిటిష్ కాలంలో 250 ఎకరాల్లో భవనాశి చెరువు నిర్మాణం జరిగింది. ఈ చెరువు కింద ఇప్పటికీ హైలెల్, లో లెవెల్, ప్లగ్‌హోల్ కాలువల ద్వారా అద్దంకిలోని నర్రావారిపాలెం, వేలమూరిపాడు, మణికేశ్వరం, గోపాలపురం, చక్రాయపాలెం గ్రామాల్లోని 1197 ఎకరాల్లో మాగాణి సాగువుతోంది. గతంలో ఈ చెరువు పల్లంలో ఉండటంతో పరిసర గ్రామాల కొండలపై నుంచి వచ్చిన వర్షపు నీటితో కలకళలాడేది. పూడిక చేరడంతో నిల్వ సామర్థ్యం తగ్గడంతో సాగు అంతంతమాత్రంగా మారింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా భవనాశి చెరువుకు బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం దగ్గర గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించి, ఆ నీటిని ఫీడర్ చానల్ ద్వారా చెరువుకు తరలించి మినీ రిజర్వాయరుగా మార్చాలని భావించారు. రూ.27 కోట్లు కేటాయించడంతో 2013లో పనులు మొదలయ్యాయి. తరువాత టీడీపీ సర్కారు పట్టించుకోలేదు.
పెరిగిన వ్యయం
దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లకు పెంచారు. వెలమారిపాలెం వద్ద చెక్‌డ్యామ్, భవనాశి కట్ట ఎత్తు పెంచడం, భవనాశి చెరువుకు నీరు చేరే విధంగా నది నుంచి ఫీడర్ చానల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం చెక్‌డ్యామ్, చెరువు కట్ట ఎత్తు పెంచే పనులు పూర్తి కాగా.. 12.6 కిలోమీటర్ల మేర తవ్వాల్సిన ఫీడర్ చానల్ పనులు మూడొంతులు మాత్రమే పూర్తయ్యాయి. అలాగే చెరువు విస్తరణ పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ప్రస్తుతం కాంట్రాక్టర్ క్లోజింగ్ ఇవ్వాలని వేడుకోలుతోపాటు, ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, అవసరమైన భూమ సేకరణ కోసం మరో రూ. 40 కోట్లు అవసరం అవుతాయని ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రూ.27 కోట్ల అంచనా పనులు ప్రస్తుతం వందకోట్లకు మించినా ఇది కలగానే మారిందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం సాగువుతున్న 1197 ఎకరాలతోపాటు, తారకరామ ఎత్తిపోతల పథకానికి నీరు అంది, మొత్తం 5 వేల ఎకరాల మెట్ట భూములు మాగాణిగా మారతాయి.
నెరవేరని మంత్రుల హామీలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తయితే ఐదు వేల ఎకరాలకు సాగు నీరు
మినీ రిజర్వాయర్ నిర్మాణం జరిగేనా?