6న ఐటీఐ అభ్యర్థులకు కౌన్సెలింగ్
మాచర్ల: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2024–25 సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు మాచర్లలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో కౌన్సెలింగ్ జరుగుతుందని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ ప్రసాద్‌బాబు సోమవారం తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి మార్కు లిస్టు, స్టడీ సర్టిఫికెట్ ఒరిజినల్స్‌తో హాజరు కావాలని తెలిపారు. ఇతర వివరాలకు మాచర్ల ఐటీఐ కాలేజీలో సంప్రదించాలన్నారు.
నేడు లక్ష్మీ వినాయకస్వామి ఆలయ వార్షికోత్సవం
పాత పాలువాయి(రెంటచింతల): పాత పాలువాయి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వినాయకస్వామి ఆలయ 31వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గార్లపాటి శివప్రసాద్ సోమవారం తెలిపారు. వేకువజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, గణపతి పూజ, పలు రకాల అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవస్థానాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.
ఘనంగా త్రిశక్తి పీఠం నాలుగో వార్షికోత్సవం
పెదకూరపాడు: పెదకూరపాడులోని మహాలక్ష్మీ మహా సరస్వతి సమేత శ్రీ వాసవీ మాత దేవస్థానం నాలుగో వార్షికోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయ శాశ్వత ధర్మకర్త పొట్టి నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో యజ్ఞ హోమాది కార్యక్రమాలు జరిగాయి. అమ్మవార్లను చందనంతో అలంకరించారు. సోమవారం రాత్రి భక్తులకు అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
బావిలో జారిపడి విద్యార్థి మృతి
నూజెండ్ల: పొలంలోని వ్యవసాయ బావిలో జారిపడి విధ్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని తంగారాల గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పమిడి ఏడుకొండలు, నాగరాజ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పవన్‌కుమార్ (21) బీటెక్ రెండో సంవత్సరం గుంటూరులో చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన ఏడుకొండలు తండ్రికి సాయంగా పొలం వెళ్లాడు. దాహం తీర్చుకోవటానికి బావిలో దిగాడు. ఆ క్రమంలో జారిపడటంతో బావి లోతుగా ఉండటంతో మునిగిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. బావి సుమారు 25 అడుగుల లోతు ఉంటుందని, ఆరు ఇంజన్లు సాయంతో నీరు తోడటంతో మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న ఐనవోలు ఎస్‌ఐ ఎంవీ కృష్ణారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
6న ఐటీఐ అభ్యర్థులకు కౌన్సెలింగ్
6న ఐటీఐ అభ్యర్థులకు కౌన్సెలింగ్


